సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా క్లైమాక్స్‌కు వచ్చిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. రేపు హీరో ఏపీలో ఎంటర్ కాబోతున్నాడని, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్ధేశించి మాట్లాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్‌లో హీరోనే విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రజా కార్యక్రమం కోసమే ఏపీ వస్తున్నారని, ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకటం సంప్రదాయమన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో డ్వాక్రా మహిళలకు ఎందుకు పసుపు, కుంకుమ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు చేసిన నాలుగు మంచి పనులు చెప్పమంటే మొహం చాటేస్తున్నారన్నారు.
మోదీ ఎవరికైనా లక్ష కోట్లు ఇస్తామని చెప్పారా?: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష కోట్లు ఇస్తామని చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికైనా లక్ష కోట్లు ఇస్తామని చెప్పారా అంటూ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి మట్టి, నీరు తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారని, దానిలో భాగంగా మోదీ రాజధానికి పవిత్రమైన మట్టి, నీరు తెచ్చారని పేర్కొన్నారు. మోదీ తెచ్చిన మట్టి, నీరు చూసి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు సొంత మీడియా లక్ష కోట్లు ఇస్తారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులకు చంద్రబాబు ముందు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment