సాక్షి, హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మూడు కుటుంబ పార్టీలేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రచార సభలో ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాహుల్‌తో కలిసి ఆడుతున్న సమిష్టి నాటకమని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు ఇటీవల జరిగిన సభలో కాంగ్రెస్ మోసపూరిత ప్రకటనలు చేసిందని అన్నారు.
టీడీపీ ఎంపీలు ఆంధ్ర మాల్యాలుగా తయారయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార ముసుగులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 5700 కోట్ల రూపాయలు టూటీ చేశారని తెలిపారు. టీడీపీ తప్పులకు చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. టీడీపీ ఎంపీలు కొల్లగొట్టిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్టంలో లేకపోయిన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారో రాహుల్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ విధానమని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment