టీడీపీ సభలో ప్లకార్డులు.. దేశ ద్రోహులైపోతారా? | Hamara Dushman, Muslim Community Furious on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

హమారా దుష్మన్‌..!

Published Tue, Apr 9 2019 4:03 PM | Last Updated on Tue, Apr 9 2019 5:09 PM

Hamara Dushman, Muslim Community Furious on Chandrababu naidu - Sakshi

గుంటూరు నగరంలో గతేడాది ఆగస్టు 28న జరిగిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభలో తమ డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా ప్లకార్డులతో నిరసన తెలిపిన పాపానికి నంద్యాలకు చెందిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులుపెట్టి ముప్పుతిప్పలు పెడుతున్న దుర్మార్గాన్ని గుర్తుచేసుకుని ఇప్పుడు ముస్లింల సమాజం.. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు’’.. అనే కవితాశ్రువులు నీలాంటి దుర్మార్గుల వల్లే చిందుతున్నాయంటూ నిప్పులు చిమ్ముతున్నారు. ‘నువ్వు పెట్టే పెట్టుడుమచ్చలు మాకు దిష్టిచ్కుల’’ని .. తప్పుడు కేసులు మాకు పూచికపుల్లలని తీసిపడేస్తూ సమరగీతం ఆలపిస్తున్నారు. అంతేకాదు..‘తూ ముసల్మాన్‌ కా దుష్మన్‌’ ..అంటూ ముక్తకంఠంతో నినదిస్తూ గుంటూరు సభలో చంద్రబాబు సర్కారు పాల్పడ్డ అరాచక ఘట్టాన్ని గుర్తుచేస్తున్నారు.   

సాక్షి, నంద్యాల/అమరావతి/గుంటూరు: వారు సాధారణ ముస్లిం యువకులు. తమ సామాజికవర్గం పడే సమస్యలను సీఎం చంద్రబాబుకు విన్నవించాలనుకున్నారు. టీడీపీ ప్రభుత్వం గుంటూరులో ముస్లింల కోసం నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’.. కార్యక్రమం అయితే మంచి వేదిక అనుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎనిమిది మంది అక్కడికి వెళ్లి తమ న్యాయమైన డిమాండ్లను శాంతియుతంగా ప్లకార్డులపై ప్రదర్శించారు. అంతే.. అంతవరకు మైనార్టీ సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం అన్న చంద్రబాబు, వారిపై ఉగ్రరూపం ప్రదర్శించారు. నిరసన తెలిపిన వారిని రెండ్రోజులపాటు స్టేషన్‌లో పెట్టించి చిత్రహింసలకు గురిచేయించారు. అంతేకాక.. ఏకంగా దేశద్రోహం కేసు పెట్టించారు. అలాగే, ఐపీసీ 505(ఐ)(V), 505(2),120(బి) సెక్షన్‌–7 క్రిమినల్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. రెండు కులాల మధ్య కానీ, రెండు వర్గాల మధ్య కానీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నించడం.. నేరపూరిత ఉద్దేశ్యంతో పథకం ప్రకారం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచాలని ప్రయత్నించడం ఈ సెక్షన్ల ప్రకారం నేరం. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎస్‌ హబీబుల్లా వారిని విడిపించడానికి స్టేషన్‌కు వెళ్తే.. ఆయనపై కూడా కేసు పెట్టేశారు. దీనిపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, నంద్యాల మైనార్టీ నేత అని చెప్పుకునే మంత్రి ఫరూక్‌ కానీ ఏమాత్రం స్పందించలేదు. కానీ.. ప్రస్తుత నంద్యాల అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వీరికి బెయిల్‌ ఇప్పించి విడుదల చేయించారు. సీన్‌ కట్‌చేస్తే.. ఇప్పుడా యువకులు దేశద్రోహం కేసులతో అష్టకష్టాలు పడుతున్నారు. కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమంపట్ల టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ సంఘటన తెలియజేస్తోందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో వారి మనోవేదన వారి మాటల్లోనే..

ప్లకార్డుల్లో ప్రదర్శించింది ఇవీ..
మదరసా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పించాలి
వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
ఉర్దూ మీడియం పాఠశాల ఏర్పాటుచేయాలి
మంత్రివర్గంలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించలేదు..  
ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలి

మైనార్టీల సంక్షేమం పట్టించుకోని టీడీపీ
ముస్లిం మైనారిటీల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పిస్తామంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. పైగా హామీలను గుర్తుచేసినందునకు నంద్యాల యువకులపై దేశద్రోహం కేసులు నమోదు చేయించారు. గత ఎన్నికల సందర్భంగా ఆయనిచ్చిన హామీల్లో అమలుకు నోచుకోనివి..

  • హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ, విశాఖపట్నం, రేణిగుంటల్లో హజ్‌ హౌస్‌లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకు నిర్మించలేదు.  
  • జిల్లాల వారీగా ముస్లింల దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు.  
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్లకు చట్టం చేస్తామని చెప్పిన విషయాన్నీ పట్టించుకోలేదు.  
  • అన్ని విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.  
  • విద్యార్థులకు వేల కోట్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదు.  
  • వక్ఫ్‌ ఆస్తులను సర్వేచేసి వాటిని పరిరక్షిస్తామనే హామీ గాలిలో కలిసిపోయింది. పైగా పలువురు టీడీపీ నాయకులు వాటిని ఆక్రమించి అనుభవిస్తున్నారు.
  • వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేస్తామన్న హామీ అటకెక్కింది.  
  • యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఊసేలేదు.
  • ముస్లింలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఫరూక్‌కు మైనార్టీ శాఖ మంత్రి పదవి ఇచ్చారు.  

వైఎస్సార్‌సీపీ ప్రస్తుత హామీలివీ..

  • అధికారంలోకి వస్తే మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలులోకి..
  • వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన ఆస్తులను రీ సర్వే చేయించి పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన పరిరక్షిస్తూ, డిజిటలైజ్‌ చేయించి ఆయా వర్గాల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక ప్రణాళిక.
  • వైఎస్సార్‌ వివాహ కానుక కింద రూ.1,00,000లు చెల్లింపు
  • హాజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం
  • ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు.  
  • ఇమామ్‌లు, మౌజన్లకు రూ.15వేల వేతనం  
  • ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షలు చెల్లిస్తారు.

బాబును ముస్లింలు మర్చిపోరు
ప్లకార్డులు ప్రదర్శిస్తే ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందనుకున్నాం. కానీ, చంద్రబాబు మమ్మల్ని జైల్లో పెట్టించారు. నంద్యాలలో చిన్న వ్యాపారం చేసుకునే నాపై దేశద్రోహం కేసు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాను తీసుకొచ్చినంత మాత్రానా సీఎంను ముస్లింలు మరిచిపోతారా!?
– మహమ్మద్‌ జుబేర్, నడిగడ్డ, నంద్యాల

లాఠీలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టారు  
నేను నంద్యాలలో పూల వ్యాపారం చేసుకుంటున్నాను. సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించామని పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇలా రెండ్రోజుల పాటు స్టేషన్లు మారుస్తూ లాఠీలతో ఎక్కడపడితే అక్కడ కొట్టి హింసించారు. మాపై పడిన దెబ్బలు నంద్యాల ప్రజలు మరిచిపోరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లింలు తగిన బుద్ధి చెబుతారు.
– మహమ్మద్‌ ఇలియాజ్, నడిగడ్డ, నంద్యాల

ఓ ఎస్‌ఐ నా ఛాతిపై తన్నారు
దివ్యాంగుడిననే జాలి కూడా లేకుండా ఓ ఎస్‌ఐ నా ఛాతిపై మోకాలితో తన్నుతూ చిత్రహింసలు పెట్టారు. మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్లకార్డులు ప్రదర్శించాం తప్ప మాకెలాంటి దురుద్దేశం లేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తే ఇలా దేశద్రోహం కేసులో ఇరికిస్తారని అనుకోలేదు.  
– షేక్‌జుబేర్‌ అహమ్మద్, చాంద్‌బాడ, నంద్యాల

పరామర్శించడమూ నేరమేనా!?  
నంద్యాలకు చెందిన యువకులు ముస్లింల సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిని జైలులో పెట్టారని తెలిసింది. వెంటనే వారిని పరామర్శించి విడిపించడానికి వెళ్లాను. పోలీసులు నాపై కూడా దేశద్రోహం కేసు పెట్టి వే«ధించారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు ముస్లింలకు చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో వారు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం.   
– డీఎస్‌ హబీబుల్లా, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అరెస్టయిన యువకులు దేశాన్ని విభజించాలని కోరుతున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలు  

అరెస్టయిన యువకులు దేశాన్ని విభజించాలని కోరుతున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement