
భూదాన్ పోచంపల్లి: నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుకు మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై ఉన్న చిత్తశుద్ధి మార్కెటింగ్‌పై లేదని, దాంతో ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవనపల్లి, గౌస్‌కొండ, ఇంద్రియాల గ్రామాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను సందర్శించారు.
విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షంతో వరి, మామిడి తోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 799 వరి రకాన్ని సాధారణ గ్రేడ్ కింద పరిగణించడం రైతు వ్యతిరేక చర్య అని, దీన్ని వెంటనే ఉపసంహరించుకుని పూర్తి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులకు రెట్టింపు లాభం చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను విస్మరించి మిల్లర్లను ప్రోత్సహిస్తూ, దళారులను పెంచడం సరికాదన్నారు.