సాక్షి, సిద్దిపేట: రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ‘రాష్ట్ర విభజన ప్రక్రియ తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు ఉంది.., తలుపులు మూసి విభజన చేశారు’అంటూ ప్రధాని చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి అన్నారు.
పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్ని విషయాలు చెప్పారని, హైకోర్టు విభజన, ప్రాజెక్టులకు జాతీయ హోదా.. తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ప్రజలు భావించారని, అయితే మోదీ ప్రసంగంలో అవేమీ ప్రస్తావనకు రాకపోవడంతో బాధపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలపడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అంటే తెలంగాణకు అన్యాయం చేయడమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల వేసిన జంబో సీడబ్ల్యూసీ కమిటీలో తెలంగాణకు స్థానం ఇవ్వకపోవడం చూస్తే వారికి ఇక్కడి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందన్నారు. కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కొందరు నేతలు అప్పులు ఆంధ్రాకు, ఆదాయం తెలంగాణకు అని మాట్లాడుతున్నా కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమం, ఇక్కడి ప్రజలపై గతంలో విషం కక్కిన టీడీపీ, అవిశ్వాస తీర్మానానికి టీఆర్‌ఎస్ మద్దతు అడగడం విచారకరమన్నారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు స్థానం ఇవ్వని బీజేపీ, సీడబ్ల్యూసీలో స్థానం ఇవ్వని కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంపై ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తోందని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అంటే ఏమిటో ఈ రెండు పార్టీలు చెప్పకనే చెప్పాయని, నాలుగు సంవత్సరాల తర్వాత మరోసారి తెలంగాణ అభివృద్ధి, హక్కులను కాపాడే విషయంలో టీఆర్‌ఎస్సే ముందుంటుందన్న విషయం ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment