నర్సాపూర్‌లో మాట్లాడుతున్న హరీశ్‌రావు
నర్సాపూర్ : కాంగ్రెస్ నాయకులు మోకాళ్లపై యాత్ర చేసిన ప్రజలు, రైతులు వారిని నమ్మరని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఘనపూర్ ఆనకట్ట, సింగూరు అంటూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా సింగూరు, ఘనపూర్ ఆనకట్టల అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు.
జిల్లా నుంచి నీటి పారుదల శాఖ మంత్రిగా సునీతారెడ్డి పని చేసినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, ఘనపూర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. అదంతా మరిచి నేడు జలదీక్ష, పాదయాత్ర అంటూ సునీతారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
సింగూరు, ఘనపూర్ ఆనకట్టలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఘనపూర్ ఆనకట్టను పట్టించుకోనందున ఆయకట్టు 21 వేల ఎకరాల నుంచి పది వేల ఎకరాలకు తగ్గిందని విమర్శించారు.
నిధులు ఎందుకు మంజూరు చేయలేదు..
తాము అధికారంలోకి రాగానే చరిత్రలో ఎపుడు లేని విధంగా ఘనపూర్ ఆనకట్టకు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం సాగు 21 వేల 530 ఎకరాలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభత్వం హయాంలో సింగూరు నీళ్లు జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్‌కు తీసుకుపోయేవారన్నారు. తాము అధికారంలోకి రాగానే హైదబాద్‌కు గోదావరి నీళ్లు తెప్పించి సింగూరు నీళ్లను జిల్లాకే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
20 ఏళ్ల చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ నాయకులు రెండు టీఎంసీ నీళ్ల కన్న ఎక్కువ నీటిని సాగుకు ఇవ్వలేదన్నారు. తాము 2016– 17, 2017–18 సంవత్సరాల్లో మూడున్నర టీఎంసీల వంతున నీటిని సాగుకు ఇచ్చామన్నారు. వర్షాలు కురిసి ఏమాత్రం నీళ్లు వచ్చినా ఘనపూర్, నిజాంసాగర్ కింద సాగుకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సునీతారెడ్డి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నపుడు మంజీర, హల్దీవాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
తాము ఉమ్మడి మెదక్ జిల్లలో 14చెక్‌డ్యాంల నిర్మాణానికి గాను సుమారు వంద కోట్ల రూపయాలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలాఉండగా సింగూరు లిప్టును చాలా ఏళ్లు మంజూరు చేయలేదని 2008 లో లిప్టు ద్వారా నీరు ఇవవాలని ఆందోలు మండల ప్రజలు అడిగినా పూర్తి చేయలేదని ఆరోపించారు.
కాగా టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రెండెళ్లకు 120 కోట్ల రూపాయలతో సింగూరు లిఫ్టును పూర్తి చేయడంతో ఆందోలు, పుల్‌కల్ మండలాల్లో 30 వేల ఎకరాలకు భూముల సాగుకు నీరు అందుతుందన్నారు. సింగూరులో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాలకు గాను 5.7టీఎంసీల నీరు జిల్లాకు అవసరమవుతుందని ఆయన చెప్పారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లిచ్చే ప్రభుత్వమని రైతులకు ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ను వారు నమ్మరన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, లక్ష్మి, అశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment