ర్యాలీలో అభివాదం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘ఈ జన్మకు ఇది చాలు.. నా మీద ఇంత గొప్పగా మీరు చూపుతున్న ఆదరాభిమానాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి హరీశ్‌కు.. గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బతుకమ్మలు, బోనాలు, కులవృత్తుల సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కష్ట కాలంలో అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా గ్రామాలకు గ్రామాలు మీకే ఓటేస్తామని తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికలొస్తే ప్రజల చుట్టూ నేతలు తిరిగే రోజుల్లో.. నన్నే మీ గ్రామాలకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చూపించే అభిమానం మరువలేను. ఒక నేతకు ఇంతకన్నా ఏం కావాలి’అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నికలంటే నేతలు ప్రజలకు డబ్బులు ఇస్తారనే ప్రచారం ఉందని, కానీ మీరే నాకు ఎదురు డబ్బులిచ్చి చరిత్రను తిరగరాస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా.. నాలో ఊపిరి ఉన్నంత కాలం మీకు సేవ చేస్తాననన్నారు.
కాంగ్రెస్‌కు కుర్చీలే ముఖ్యం..
తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, తర్వాత విలీనం చేయలేదని.. గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజల బాగోగులు, వారి కష్ట సుఖాల కన్నా కుర్చీలే ముఖ్యమనే విషయం ఆజాద్ మాటల ద్వారా బయటపడిందన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాల వల్లే ఢిల్లీ ప్రభుత్వం తలవంచి రాష్ట్రం ఇచ్చిందని వివరించారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వాలనే ఉంటే 1969లో 369 మంది చనిపోయినా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజా సమితి ద్వారా ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే వారికి పదవులు ఆశచూపి రాష్ట్ర ఏర్పాటును పక్కన పెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష చేపడితే ఖమ్మం జైలుకు తరలించిన ప్రభుత్వం శ్రీకాంతాచారి ఆత్మాహుతికి తలవంచక తప్పలేదని గుర్తుచేశారు. ఈ పోరాటాలతోనే 2009 డిసెంబర్‌లో కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేసి, వెంటనే ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. 2004లో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్, కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా రాష్ట్రాన్ని ప్రకటిస్తామని మభ్యపెట్టారని చెప్పారు. ఆజాద్ ఈ చరిత్ర మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, గులాబీ జెండా లేకుండా తెలంగాణ వచ్చేదా, ఈ కాంగ్రెస్ వారు తెచ్చేవారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పినా గత ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు గెలిపించి.. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో రుజువు చేశారన్నారు.
ఓట్ల కోసం వస్తే నిలదీయండి
నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. గత పాలకుల నలభై ఏళ్ల ఏలుబడిలో జరిగిన అభివృద్ధి కంటే అధికంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు మరింత చేరువయ్యారని పేర్కొన్నారు. విభజన చట్టంపై మాట మాట్లాడని కాంగ్రెస్ నాయకులు.. ఓట్ల కోసం వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన శాఖ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాబు పాదాల వద్ద పెట్టినట్టే..
టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఏ పార్టీకీ లేకే పొత్తులు పెట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు.. ఏర్పడ్డ తర్వాత కూడా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబుతో జతకట్టి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయడం శోచనీయమన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని చంద్రబాబు పాదాల వద్ద పెడతారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలిస్తామని చెబుతున్నారని.. అదే జరిగితే తెలంగాణలోని పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చేసే పనితో తెలంగాణలో నిరుద్యోగం పెరిగి పోతుందని వివరిం చారు. తెలంగాణపై అభిమానం ఉంటే.. పోల వరానికి జాతీయ హోదా ఇచ్చినప్పుడు ప్రాణహితకు ఎందుకు ప్రకటించలేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment