గజ్వేల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: కాంగ్రెస్ పార్టీది ఎప్పుడైనా ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదేనని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనదైన చతురతతో ఆ పార్టీ మెడలు వంచి తెలంగాణను తేగలిగారని అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి, ములుగు మండలం కొట్యాల తదితర గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ.. మహాకూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని పేర్కొన్నారు. మేడ్చల్‌లో నిర్వహించనున్న సోనియాగాంధీ ఎన్నికల ప్రచార సభకు కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆహ్వానించగలరా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన బాబును పిలిస్తే ఓట్లు పడవనే భయంతో కాంగ్రెస్ నేతలు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. సోనియాసభకు రాహుల్‌ని పిలిస్తే ఏపీ సీఎం గతంలో చేసిన నిర్వాకాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. బాబు ముఖం చూస్తే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే భయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు.
కూటమిలో కోదండరాం పరిస్థితి దయనీయం
కూటమి అంటే అందరు కలిసుండాలె కదా.. ఇదేమి దుస్థితి..? అంటూ హరీశ్ అన్నారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాంను టీఆర్‌ఎస్ ఐదేళ్లు నెత్తిన పెట్టుకొని గౌరవించిందని, నేడు మహాకూటమిలో ఆయన పరిస్థితి దయనీయంగా మారిందన్నా రు. ఆయనకే నేడు సీటు దిక్కులేదన్నారు.
సీటిచ్చి.. లేదన్నరు
పొద్దుగాళ్ల జనగామ సీటిస్తమని చెప్పగానే ఆయన ఓ బిల్డింగ్ తీసుకొని కలర్ కూడా వేసుకుండు.. రథాలు తయారు చేసుకుండు.. కానీ పొద్దూకేసరికి సీటు పోయిందని హరీశ్ ఎద్దేవా చేశారు. నెల రోజులు మోయని కాంగ్రెస్ పార్టీ తీరును ఇప్పటికైనా కోదండరాం పునరాలోచన చేసుకోవాలని సూచించారు. దుబ్బాక, వరంగల్ (తూర్పు), పటాన్‌చెరులాంటి స్థానాల్లో కూటమి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒకరిపై మరొకరు బీ–ఫాంలు ఇచ్చుకొని ప్రజల్లో పరువు తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment