ప్రభుత్వానిది డ్రామా... కాంగ్రెస్‌ది అసహనం | Harish Rao Fires on Congress | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది డ్రామా... కాంగ్రెస్‌ది అసహనం

Published Thu, Nov 2 2017 2:42 AM | Last Updated on Thu, Nov 2 2017 2:42 AM

Harish Rao Fires on Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంట రుణాల మాఫీ, పంటలకు మద్దతు ధర అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటల యుద్ధానికి దారి తీసింది. సభలో ప్రభుత్వం డ్రామా చేస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడగా కాంగ్రెస్‌లో అసహనం పెరుగుతోందని శాసనసభ వ్యవహా రాల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణ మాఫీ, మద్దతు ధరపై మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆయన ప్రసంగంపై అభ్యంతరం తెలిపారు. రుణమాఫీలో వడ్డీ భారంపై చెప్పకుండా మంత్రి ఏవేవో చెబుతున్నారన్నారు. అన్ని అంశాల గురించి చెబుతామని మంత్రి చెప్పగా తాము ప్రస్తావించిన అంశాలపై నివృత్తికి అవ కాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యులు కోరారు. మంత్రి మాట్లాడడం పూర్తయ్యాక అవకాశం ఇస్తామని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

అందుకు అంగీకరించని కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు... వారిలో అసహనం పెరుగు తోందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులు సీట్లలో కూర్చుంటే అవకాశం ఇస్తామన్నారు. ఈ సమయంలో జానారెడ్డి నిల్చుని... ‘ఆయన (స్పీకర్‌) ఎందుకు వెళ్లారో... మీరెందుకు (డిప్యూటీ స్పీకర్‌) వచ్చారో మాకు తెల్సు. ఇదొక డ్రామా. ఏం జేస్తరో చూస్త. అధికార పక్షానికి ఓపిక ఉండాలె. నేను ఎవరినీ ఎప్పు డూ తిట్టను. నాకు ఆ అవసరంలేదు. రైతుల పక్షాన ప్రణమిల్లుతున్నాను’ అని వ్యాఖ్యానిం చారు. ఆపై ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం సంచికలో వచ్చిన ఎడిటోరియల్‌ను చదవడం మొదలుపెట్టారు. జానా తీరుపై మంత్రి హరీశ్‌ మండిపడ్డారు. స్పీకర్‌ స్థానాన్ని గౌరవించాలనే విషయాన్ని పట్టించుకోకుండా జానారెడ్డి మాట్లాడారని విమర్శించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న మహిళా డిప్యూటీ స్పీకర్‌ను కించపరిచారని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాం డ్‌ చేశారు. జానా మాట్లాడుతూ తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదని, అలాంటి దేమైనా ఉంటే తన వ్యాఖ్యలను ఉపసం హరించుకుంటున్నానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement