తొర్రూరులో నిర్వహించిన రోడ్‌షోలో అభివాదం చేస్తున్న హరీశ్‌రావు, దయాకర్‌రావు
సాక్షి, యాదాద్రి/ సిద్దిపేట/మహబూబాబాద్: ‘వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తయో ఓట్ల కాలం వచ్చిందంటే కాంగ్రెసోళ్లు కూడా అలాగే వస్తరు.. వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఓట్ల అనంతరం కాంగ్రెసోళ్లు మళ్లీ కనిపించకుండా పోతరు’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. వలి గొండలో జన ప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే వలిగొండ మండలంలో 30 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని, చెరువులు, కుంట లు నిండుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి నీటితో ప్రజల కాళ్లు కడుగుతామని హరీశ్ అన్నారు.
ఢిల్లీకి ఉత్తరాలు రాసిండు..
కాళేశ్వరం వద్దని, కాళేశ్వరం నిర్మిస్తే పోలవరానికి నీరు రాక ఏపీలో మూడో పంటకు నీరు అందదని చంద్రబాబు ఢిల్లీకి ఉత్తరాలు రాశారని మంత్రి ఆరోపించారు. నోటికాడి బుక్కను లాక్కుంటూ, నీరు రాకుండా చేస్తున్న చంద్రబాబును కాంగ్రెస్ నెత్తిలో పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను జైలులో వేస్తామంటున్నారని, తెలంగాణ తెచ్చినందుకా లేక అభివృద్ధి చేసినందుకా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న సంగతి వారికి అర్థమైందన్నారు. మహాకూటమిని గెలిపిస్తే పరాయోడి చేతికి పాలనను అప్పజెప్పినట్లేనన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొంత డబ్బులతో ఇళ్లకు స్థలాలు ఇచ్చిండు..
సొంత డబ్బులతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరేనని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. నీళ్లు కావాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.
కూటమిలో ఇప్పటికీ కొట్లాటలే
కూటమిలో కుమ్ములాటలు, సీట్ల కోసం సిగపట్లు ఇంకా పోలేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి కేవలం హైదరాబాద్‌లోనే ఉందని, కూటమి నేతలు ఆఫీసులకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ఆయా పార్టీ ల కార్యకర్తలు కలసి లేరన్నారు. కూటమిలోని వారు ఒకరిపై ఒకరికి నమ్మ కం లేక ఎవరికివారే బీ ఫామ్‌లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మహాకూటమిగా కలవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నుంచి వస్తున్న వలసలే అందుకు నిదర్శనమన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ సర్వేల పేరిట కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment