సాక్షి, హైదరాబాద్ : ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తొలిరోజే నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. ఆ రోజు ఏం జరిగినా కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని, సీఎల్పీ నేత జానారెడ్డి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏం అంశంపైన అయినా చర్చకు సిద్ధంగా ఉందన్నారు.
ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునేదే సమస్యలపై చర్చించుకునేందుకు అన్నారు. మూడు నుంచి నాలుగు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఇక పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో తెలుసు అని, ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడే మైక్ కట్ చేసిన విషయం తెలిసిందే అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదని అసెంబ్లీ సమావేశాలు చాలా హుందాగా జరుగుతున్నాయన్నారు.
కాగా ఈ నెల 27 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే రైతుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్షం, రూ.లక్ష రుణ మాఫీకి సంబంధించిన వడ్డీ చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అమలు చేయకపోవడం, పంటలకు గిట్టుబాట ధర కల్పించకపోవడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment