సాక్షి, న్యూఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందంటూ పలు సర్వేలు సూచిస్తోన్న నేపథ్యంలో పాలకపక్షం బీజేపీ ప్రధానంగా తన దృష్టిని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పెట్టింది. అధికారంలో ఉన్న హరియాణాపై అంతగా దృష్టిని కేంద్రీకరించలేదు. ఈ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మే 12, మే 19 మరో రెండు విడతల పోలింగ్ మిగిలివున్న విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని పది సీట్లకుగాను ఏడు లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగా, రెండు సీట్లను ‘ఇండియన్ నేషనల్ లోక్‌దళ్’ గెలుచుకోగా, ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకుంది.
2014, అక్టోబర్‌లో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి ఆది నుంచి ఆటు పోట్లు తప్పడం లేదు. హిస్సార్‌లో ఓ ఆధ్యాత్మిక గురువును హత్య కేసులో అరెస్ట్ చేయడంతో ఆయన అనుచరులకు, పారా మిలటరీ దళాలకు పెద్ద హింసాకాండే చెలరేగింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన జాట్‌లు 2016లో తమకూ విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారి ఆందోళన విధ్వంసకాండకు దారితీయడంలో 20వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 2017, ఆగస్టు నెలలో డేరా సచ్చా సౌదాకు చెందిన మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ చెలరేగింది. ఈ సంఘటనల్లో 126 కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసం అయినట్లు అంచనా వేశారు. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో పలు గోరక్షకుల దాడులు జరగడంతో ఎందుకు సరైన నివారణ చర్యలు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టు నుంచి చీవాట్లు కూడా తినాల్సి వచ్చింది.
ఖట్టర్ ప్రభుత్వం ఇటీవల 18 వేల పోస్టులను పోలీసులు, టీచర్లు, డీ తరగతి ఉద్యోగులతో భర్తీ చేయడం ఒక్కటే ప్రభుత్వానికి కాస్త అనుకూలించే అంశం. ‘నాలుగేళ్ల నుంచి ఏం చేస్తోందీ ఈ ప్రభుత్వం ?’ అంటూ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోన్న హర్ష అనే మహిళ ప్రశ్నిస్తోంది. తాను 2009లో టీచర్ టెస్ట్ పాసయ్యాయని, పదేళ్ల తర్వాత టీచర్ నియామకాలు జరిగాయని, ఇప్పుడు తనకు 40 ఏళ్లు రావడంతో ఉద్యోగానికి అర్హురాలిని కాలేక పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎంతో మంది నష్టపోయి ఉంటారని ఆమె అన్నారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగంతో బాధ పడుతుంటే 18 వేల ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసిన జాట్లు ఈసారి కాంగ్రెస్, లోక్‌దళ్‌కు వేస్తామని చెబుతుండగా, వారిని రాజకీయ ఆదిపత్యాన్ని అంగీకరించని ఇతర సామాజిక వర్గాల వారు ఏం చేయకపోయినా బీజేపీకి వేస్తామని చెబుతున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్రంలో జాట్లతే ప్రాబల్యం నడుస్తోందని, వారి ఆందోళన సందర్భంగా అన్యాయంగా తమ దుకాణాలను తగలబెట్టారని చిల్లర వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment