హరియాణా కొత్త సీఎంగా సైనీ ప్రమాణం
సీట్ల సర్దుబాటులో జేజేపీతో విభేదాలు
చండీగఢ్: హరియాణాలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపించింది.
హరియాణాలో లోక్‌సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేజేపీతో బీజేపీకి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో చివరకు సీఎం ఖట్టర్, 13 మంది మంత్రులు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు హరియాణా నివాస్‌లో కలిసి 54 ఏళ్ల సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ సైనీ గవర్నర్‌ను కలిసి కోరారు. ఇందుకు గవర్నర్ ఒప్పుకోవడంతో హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ మంత్రులుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఖట్టర్ హాజరయ్యారు.
జేజేపీతో పొసగని పొత్తు
సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ–జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీచేస్తామని జేజేపీ పార్టీ పట్టుబట్టడంతో పార్టీతో పొత్తుకు బీజేపీ ఫుల్‌స్టాప్ పెట్టిందని తెలుస్తోంది. ఖట్టర్ రాజీనామా తర్వాత డెప్యూటీ సీఎం పదవి నుంచి జేజేపీ నేత దుష్యంత్ తప్పుకోవాల్సి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
ఈసారీ గెలుపు ఖాయమని భావిస్తోంది. అందుకే గెలవబోయే స్థానంలో ఖట్టర్‌ను నిలపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన డిమాండ్‌ను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో జనాభాలో 30 శాతమున్న ఓబీసీ వర్గానికి చెందిన సైనీని సీఎంగా చేసింది. 2014లో తొలిసారి ఎంపీ అయిన ఖట్టర్‌ను సీఎంగా ఎంచుకున్నట్లే తొలిసారి ఎంపీ అయిన నాయబ్‌నూ సీఎంగా కమలదళం ఎన్నుకుంది. ప్రస్తుత హరియాణా శాసనసభ కాలపరిమితి అక్టోబర్‌తో ముగియనుంది. ఈలోపు ఓబీసీ నేతతో సీఎం పదవిని భర్తీచేసి ఓబీసీలను తమవైపు తిప్పుకోవాలని పార్టీ భావిస్తోంది.
బలపరీక్షకు అవకాశమివ్వండి
తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్‌కు లేఖ రాశారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. తమకు ఆరుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు, ఒక హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment