![HCA President Mohammad Azharuddin Meet Minister KTR At Pragathi Bhavan - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/29/azhar.jpg.webp?itok=OBvEueBp)
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రితో భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ శనివారం భేటీ అయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నికైన అజహరుద్దీన్.. తాను సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌తో అరగంటపాటు ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో అజహరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం గురించి చర్చించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన ఎందరో యువకులున్నా, సరైన అవకాశాలు రావడం లేదనే విషయంతోపాటు, క్రికెట్ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. హెచ్‌సీఏ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తనతోపాటు నూతనంగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గాన్ని కేటీఆర్‌కు పరిచయం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరిస్తూ.. హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో తాను కేవలం క్రికెట్‌కు సంబంధించిన అంశాలపైనే కేటీఆర్‌ను కలిసినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను ఎప్పుడు కలుస్తారని ప్రశ్నించగా ‘సీఎం రాష్ట్రానికి బాస్.. వీలైనంత త్వరలో ఆయనను కలుస్తా’అని సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment