మీడియాతో మాట్లాడుతున్న కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సంకీర్ణ భాగస్వామ్యంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం చెప్పారు. టీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కలసి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. కూటమిలోని సీట్ల సర్దుబాటు అంశాన్ని పార్టీ సమావేశంలో ఇంకా చర్చించలేదని తెలిపారు. పార్టీ మేనిఫెస్టో, విస్తరణ, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపైనే చర్చించినట్టుగా కోదండరాం వెల్లడించారు. అయితే సీట్లు సర్దుబాటుపై చర్చను ఎక్కడోచోట ఆపాల్సిందేనని వ్యాఖ్యానించారు.
సీట్ల సర్దుబాటు సమస్యే కాదని.. సంకీర్ణాన్ని నడిపే కాంగ్రెస్‌పైనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి బాధ్యత ఉందన్నారు. కూటమి తరఫున నియమావళిని తయారుచేసుకుని ముందుకెళ్ళాలని సూచించారు. కూటమిలో పార్టీలు సమన్వయంతో నడిస్తే సమస్యలు అవే పరిష్కారమవుతాయన్నారు. భాగస్వామ్య పక్షాలతో వ్యవహరించే విధానంపై స్పష్టత రావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు ఇది కీలకమని వెల్లడించారు. ప్రచారం నడుస్తోందని, మరింత వేగాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జులు, మేనిఫెస్టోపై వివిధ కమిటీల ద్వారా చర్చించినట్లు తెలిపారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను ప్రకటించారు.
టీజేఎస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు...
♦ సామాజిక న్యాయ సాధికారత
♦ ఉచిత విద్య, వైద్యం
♦ ఉద్యోగ, ఉపాధి కల్పన చర్యలు
♦ వ్యవసాయం.. నైపుణ్య అభివృద్ధి
♦ జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, మండలానికో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, సర్టిఫికెట్ కోర్సులు
♦ వ్యవసాయ బడ్జెట్, మార్కెట్‌లో దోపిడీకి అడ్డుకట్ట
♦ రూ.2 లక్షల రుణమాఫీ.. సరైన పద్ధతిలో ఎరువుల పంపిణీ
♦ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు కుటీర పరిశ్రమల ఏర్పాటు
♦ వికలాంగులకు ప్రత్యేక శాఖ
♦ ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు
♦ సుధీర్ కమిషన్ నివేదిక అమలు
♦ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
♦ కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణకు చట్టం
♦ పట్టణాల అభివృద్ధిలో భాగంగా పబ్లిక్ స్థలాల పరిరక్షణ
♦ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మిగిలిన అన్ని జిల్లాలో కూడా అభివృద్ధి
♦ మద్యం నియంత్రణ.. బెల్ట్‌షాప్‌ల కట్టడి
♦ ఉద్యోగుల సంక్షేమం, పాత పెన్షన్ విధానం అమలు, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ వారిని వెనక్కి తీసుకురావడం
♦ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్లు,హెల్త్‌కార్డులు
♦ ఉద్యమకారులందరికీ పెన్షన్‌లు.. ఉద్యమ కేసుల ఎత్తివేత
♦ ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత
♦ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్.
కోదండరాం పోటీ చేయాల్సిందే
ఈ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం కచ్చితంగా పోటీచేయాలని పలువురు టీజేఎస్ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. పార్టీని అసెంబ్లీలోనూ, బయటా నడపడానికి కోదండరాం ముందుండాలని కోరారు. కాంగ్రెస్ లీకులను సమర్థంగా తిప్పికొట్టాలని కొందరు నేతలు సూచించారు. కూటమికి చైర్మన్‌గా కోదండరాం ఉండాలని, యువకులకు సీట్లివ్వాలని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా కోదండరాంను ప్రకటించాలని కొందరు నేతలు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment