
ధన్‌ధుకా : అయోధ్య భూ వివాదానికి, 2019 లోక్‌సభ ఎన్నికలకు మధ్య సంబంధం ఏంటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రామ మందిరం కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ నాయకుడు, లాయర్ కపిల్ సిబల్.. 2019 ఎన్నికలు ముగిసే వరకూ కేసును వాయిదా వేయాలని ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి విన్నవించిన విషయం తెలిసిందే.
దీనిపై బుధవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. 2019 వరకూ కేసును వాయిదా వేయాలని లాయర్ కోరడం అసమంజసం అని అన్నారు. ఎన్నికల వరకూ కేసును వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న లాజిక్ ఏంటని సిబల్‌ను ప్రశ్నించారు. ముస్లిం కమ్యూనిటీ తరఫున సిబల్ పోరాడటంపై ఎలాంటి అభ్యతరం లేదని చెప్పారు.
కానీ, వచ్చే ఎన్నికలు ముగిసే వరకూ అయోధ్య కేసును ఎటూ తేల్చొద్దని ఎలా చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రామ మందిరం కేసుతో లింక్ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దేశం ఎలా పోయినా కాంగ్రెస్‌కు ఫర్వాలేదని అన్నారు. కాగా, అయోధ్య భూవివాదం కేసు తుది విచారణను ఫిబ్రవరి 8, 2018కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కేసులో సిబల్ స్టాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.