లక్నో/ధంధుక: రామజన్మ భూమి–బాబ్రీ మసీదు కేసు విచారణను 2019 సార్వత్రిక ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కపిల్ సిబల్, కాంగ్రెస్‌లపై బుధవారం తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వాడుకోవడం తగదని మోదీ హితవు పలికారు. అహ్మదాబాద్ జిల్లాలోని ధంధుకలో మోదీ మాట్లాడుతూ ‘సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణను వాయిదా వేయాలని కోరడం తప్పు.
కాంగ్రెస్ ఎన్నో చిక్కులను పరిష్కరించకుండా ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పుడు అర్థమౌతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇలా చేయడం సహేతుకం కాదు’ అని అన్నారు. ముస్లిం మతంలో తక్షణం విడాకులిచ్చే ముమ్మారు తలాక్ విధానాన్ని సుప్రీంకోర్టులో వ్యతిరేకిస్తే యూపీ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని అప్పట్లో అందరూ హెచ్చరించారనీ, అయినా ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం తాము వెనకడుగు వేయలేదని మోదీ చెప్పారు. కాగా, తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది.
అవి మా వాదనలు కావు: వక్ఫ్‌బోర్డు
సిబల్ కోర్టులో తమ సంస్థ తరఫున వాదించలేదని యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ స్పష్టం చేశారు. ‘ఈ కేసులో కక్షిదారు అయిన హసీం అన్సారీ కొడుకు తరఫున మాత్రమే సిబల్ వాదించారు. విచారణను వాయిదా వేసేలా కోర్టును కోరమని సున్నీవక్ఫ్‌బోర్డు ఆయనకు చెప్పనేలేదు’ అని అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో తాను ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నానన్న దానికన్నా, దేశం ముందున్న సవాళ్లపై మోదీ దృష్టి పెట్టాలంటూ సిబల్ ఎదురుదాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment