
సాక్షి, విజయవాడ : వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, ఆయన సోదరుడు నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర.. రంగా విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో రాఘవయ్య పార్క్‌లోని రంగా విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రంగా హత్యకు కారణమైన తెలుగుదేశంలో రాధాకృష్ణ చేరడం చాలా బాధకరమని, రాధాకృష్ణ నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు గురయ్యారని ఈ సందర్భంగా నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాధా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాధా-రంగా మిత్రమండలి సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గతంలో రంగా సతీమణి చేసిన తప్పే నేడు రాధా కూడా చేస్తున్నారని, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రంగా అభిమానులంతా క్షోభకు గురువుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రంగా హత్యకు కారణమైన పార్టీలోకి ఎలా చేరుతారని ఆయన అభిమానులు రాధాను నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment