
ఒంగోలు: వంగవీటి రాధా టీడీపీలో చేరి చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా, రంగా కుటుంబంపై సీఎం వైఎస్ జగన్‌కు, తమకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు.
తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని రాధా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించిందని చెప్పారు. గన్‌మెన్లను వద్దనుకోవడం రాధా వ్యక్తిగతమని పేర్కొన్నారు. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంపై పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని చెప్పారు.