నగరపాలక సంస్థలో ఆయన కీలక నాయకుడు.. ఇన్నాళ్లూ పైకి మంచోడిలా కనిపించిన ఆయన ముసుగు తొలగించి తన కపట బుద్ధిని బయటపెట్టాడు.! నాటి శాసన సభ్యుడితో సన్నిహితంగా మెలుగుతూనే ఆయన కన్నుగప్పి భూ దందాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేడు స్వార్ధప్రయోనాల కోసం వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తల్లి లాంటి పార్టీకే ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీలో పదవులు అనుభవించి..సుదీర్ఘంగా ప్రయోజనాలు పొంది.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీని వదిలిపోవడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నమ్మిన వారిని నట్టేట ముంచడం సర్వసాధారణంగా మారింది. ఒంగోలు నగరానికి చెందిన ఓ నాయకుడి వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉంది.
పార్టీలోనూ అధిక ప్రాధాన్యం..
ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సదరు నాయకుడికి పార్టీ పరంగానూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగర పాలక సంస్థలో సభ్యుడిగా ఉంటూనే పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ఆయన కనిపించేలా కీలకంగా వ్యవహరించాడు. ముఖ్యంగా నాటి శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా ఉంటూనే ఆయనకు తెలియకుండా అన్ని పనులు చక్కబెట్టుకున్నాడు. తీరా సొంత పార్టీ అధికారం కోల్పోయాక పచ్చ పార్టీలో చేరేందుకు రాయ‘బేరాలు’ నెరుపుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైకి 24 కేరట్ బంగారంలా కనిపిస్తాడు కాని నిజానికి అసలు సిసలు కల్తీ బంగారమని తనకు తానే రుజువు చేసుకుంటున్నాడు.
కేసుల నుంచి తప్పించుకునేందుకేనా?
ఒంగోలు నగరంలో భూ కబ్జాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు వాటిని నాటి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అంటగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే భూకబ్జాలు, నకిలీ పట్టాల సృష్టికర్తల వివరాలు బట్టబయలు చేయడం ద్వారా టీడీపీ నేతల విమర్శలను బాలినేని తిప్పికొట్టారు. అదే సమయంలో భూకబ్జా ఆరోపణలపై బాలినేని సిట్ విచారణకు నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీపైనా ఒత్తిడి తీసుకొచ్చి పట్టుబట్టి మరీ ‘సిట్’ వేయించారు. సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని మీడియా ముఖంగా బాలినేని స్పష్టం చేశారు. భూ కబ్జాలపై ఇప్పటికీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు నాయకుడు తన భూ దందాల గుట్టు బయటపడుతుందనే భయంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
పక్కాగా సేఫ్ గేమ్..
సదరు నాయకుడు ఎలాగైనా భూ కబ్జాల కేసుల నుంచి బయటపడేందుకు ఎన్నికలకు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తన బంధువులను, సన్నిహితులను టీడీపీలోకి పంపేశాడు. ఒక వేళ అధికారం కోల్పోతే టీడీపీలోకి వెళ్లిన వారి సాయంతో తాను ఆ పార్టీకి వెళ్లిపోవచ్చనే పథకాన్ని రచించాడు. తన సేఫ్ గేమ్‌లో భాగంగా టీడీపీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తనతో పాటు నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లు, మరికొంత మంది వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను తీసుకొస్తానని పచ్చపార్టీ ముఖ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.
తాయిలాలు..బెదిరింపులు:
తనతో పాటు పార్టీ మారాలంటూ సదరు నాయకుడు సహచర కార్పొరేటర్లతో రాయబారం నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు టీడీపీలోకి వస్తే ఆర్థికంగా బాగుంటుందని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులకు తెరతీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడి వ్యవహారాన్ని వైఎస్సార్ సీపీ కేడర్ అసహ్యించుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్న అతడి చర్యలను ఖండిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment