దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ | - | Sakshi
Sakshi News home page

దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ

Published Mon, May 6 2024 9:50 AM | Last Updated on Mon, May 6 2024 10:54 AM

-

ఒంగోలు అభివృద్ధికి అడ్డంకిగా దామచర్ల

అధినేత మెప్పు కోసం ముస్లింలపై దాష్టీకం

పేదల ఇళ్లపై అక్కసు

నాడు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించి

నేడు సీఎం ఇచ్చిన పట్టాలపై అసత్య ప్రచారం

తనవారి కోసం పేదలపై కేసులు

నాడు జెడ్పీ పీఠం కై వసానికి కుట్రలు

తిప్పికొట్టిన బాలినేని, ఆదిమూలపు

కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటే

ఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.

👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్‌ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్‌ వాటర్‌ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్‌ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్‌ వాటర్‌ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు కాలేదు.

👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.

👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్‌ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.

👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్‌ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.

👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.

👉 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్‌ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.

👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్‌ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.

👉 స్థానిక బైపాస్‌లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్‌ఎస్‌పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.

👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్‌ లైసెన్స్‌, టూ వీలర్‌ కాగితాలు చూపించాలని ట్రాఫిక్‌ ఎస్సై మహేష్‌ కోరినందుకు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌నే ముట్టడించారు.

బాబు మెప్పుకోసం..
తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్‌ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్‌ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది.

 అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్‌ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.

జెడ్పీ పీఠంపైనా కుట్రే..
2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్‌ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.

కాపులపైనా కేసులు
అధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్‌ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement