సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పనితీరులపై నిర్విహించిన ముందస్తు సర్వేల్లో మెజారిటీ రాష్ట్రాల ప్రజలు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర పాలన పట్ల కన్నా రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. సీఎస్‌డీఎస్ గత మార్చిలో విడుదల చేసిన ముందస్తు సర్వే నివేదిక ప్రకారం కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కేంద్రంలోని బీజేపీ పాలనకన్నా తమ రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక తమిళనాడు, కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయింది. సీ ఓటర్ సర్వే అంశాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకన్నా కేంద్రం పాలన పట్లనే ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకన్నా కేంద్ర ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి ఎక్కువ వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేంద్రం పాలనకన్నా రాష్ట్రం పాలన పట్ల ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీతో చేతులు కలిపి లోక్‌సభకు పోటీ చేస్తున్న అన్నా ఏఐడిఎంకే రాష్ట్ర పాలనపట్ల, అటు కేంద్రం పాలనపట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకేనేమో రాష్ట్ర పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయిన తెలంగాణలో పాలకపక్ష టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజల సంతృప్తి, అసంతృప్తిల ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలి. లోక్‌సభకు ఇప్పటికే ఐదు విడతల పోలింగ్‌లు ముగియగా, మరో రెండు విడతల పోలింగ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రజలు ముందస్తుగా వ్యక్తం చేసిన అభిప్రాయలకే కట్టుబడి ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్లనే ప్రజలు సంతృప్తి అయినా అసంతృప్తయినా ఎక్కువ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment