సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితమే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టని.. ఈ పనిని తాము ప్రారంభిస్తే.. ఇప్పుడు టీఆర్‌ఎస్ సర్కారు పేరు పెట్టుకుంటోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, పార్టీ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్, దానం నాగేందర్, సర్వే సత్యనారాయణతో కలసి బుధవారం ఆయన నగరంలోని సుల్తాన్‌బజార్, మలక్‌పేట్, లక్డికాపూల్ మెట్రోస్టేషన్లను పరిశీలించారు. సుల్తాన్‌బజార్‌లో ఆస్తులు కోల్పోయిన బాధితులతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులను అనుమతించకపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మొత్తం పూర్తయ్యాకే ప్రారంభించాలి: దానం
మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు పూర్తయ్యాకే ప్రాజెక్టును ప్రారంభించాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని సర్కారుకు తెలియజెప్పేందుకే తాము మెట్రో స్టేషన్లను సందర్శిస్తున్నామని చెప్పారు. స్వల్ప దూరాలకు మెట్రో ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదని, ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ హయాంలోనే బీజం పడిందని, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే పనులు మొదలయ్యాయని గుర్తుచేశారు. కేసీఆర్, మోదీకి ఈ ప్రాజెక్టుతో సంబంధంలేదన్నారు. పాతనగరంలో మూసీ మీదుగా మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చడం దారుణమన్నారు. మెట్రో పనుల ఆలస్యం కారణంగా ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.4 వేల కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం లోపాయికారిగా అంగీకరించడంతోనే పాతనగరంలో మెట్రో పనులు తాజాగా మొదలయ్యాయన్న అనుమానం కలుగుతోందని చెప్పారు.
యూపీఏ ఘనతే: సర్వే
మెట్రో ప్రాజెక్టును సాధించిన ఘనత నాటి యూపీఏ, కాంగ్రెస్ సర్కారుతోపాటు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లకు దక్కుతుందని సర్వే సత్యనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి శనిలా దాపురించారని
మండిపడ్డారు.
మెట్రో ప్రాజెక్టులో రహస్యం ఏముంది: ఉత్తమ్
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో పనులను పరిశీలించేందుకు వచ్చిన తమను లోనికి అనుమతించకపోవడం దారుణమని, ఈ ప్రాజెక్టులో రహస్యం ఏముందని ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టు తెలంగాణ ప్రజలదని, హైదరాబాద్ ప్రజల సొత్తని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై ఆంక్షలు విధించి లోనికి అనుమతించక పోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలైన్‌మెంట్ మార్పు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మెట్రో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమవ్వడమేకాక.. ప్రభుత్వంపై రూ.3,500 కోట్ల ఆర్థికభారం పడిందని ఉత్తమ్ విమర్శించారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర మెట్రో అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ఘనత కాంగ్రెస్‌దే: షబ్బీర్
ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, గోదావరి ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని షబ్బీర్ అలీ అన్నారు. తాము చేసిన పనులను ఇప్పుడు టీఆర్‌ఎస్ వారు చేసినట్లు చెప్పుకోవడం దారుణన్నారు. కేసీఆర్, కేటీఆర్ నగర అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, మూడున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు వెచ్చించలేదని చెప్పారు. నగరంలో రహదారులు అధ్వానంగా మారాయని, డ్రైనేజీ సమస్యలతో జనం అవస్థలు పడుతున్నారని, ఈ ప్రభుత్వానిది జీరో పాలన అని ఎద్దేవా చేశారు.