సాక్షి, ముంబై: బీజేపీపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం పదవికి రాజీనామా చేసిన సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ఘాటుగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అబద్ధాల కోరుగా వర్ణించారు. సీఎం పీఠం, 50:50 ఫార్ములాపై తనతో చర్చలు జరిపిందుకు అమిత్ షా, ఫడ్నవిస్ తన నివాసానికి వచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల సందర్భంగా సీఎం పీఠంపై తాము చేసిన ప్రతిపాదనలకు షా, ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారని, ఫలితాల అనంతరం రూటు మార్చారని విమర్శించారు. మోదీపై విమర్శలు చేశారన్న ఫడ్నవిస్ వ్యాఖ్యలను ఠాక్రే ఖండించారు. బీజేపీ నేతలు ఇంత దిగజారుతారని తాను ఎప్పుడూ అనుకోలేదని ఠాక్రే పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు బీజేపీ నాయకత్వమే కారణన్నారు. సీఎం పీఠం తమదే అన్న బీజేపీ నేతలు.. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సవాలు విసిరారు. (చదవండి: ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు)
శుక్రవారం ఉద్దవ్ ఠాక్రే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫలితాల అనంతరం పదవులను చెరిసగం పంచుకోవాలనే ఒప్పందం ముందే కుదిరింది. కానీ ఫలితాల తరువాత బీజేపీ మాతో విభేదించింది. షా పెద్ద అబద్ధాల కోరు. మహారాష్ట్ర ప్రజలు అమిత్ షా, అండ్ కోను చూసి ఓట్లు వేయలేదు. ఠాక్రేలను చూసి ఓట్లు వేశారు. నమ్మకం అనే పేరుతో బీజేపీ నేతలు మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నారు. దానికి మేం సిద్ధంగా లేం. వారు చెప్పినట్టు వింటానికి నేను బీజేపీ వాలా కాదు. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు నేను కోరలేదు. కశ్మీర్‌లో బీజేపీ, పీడీపీతో అధికారాన్ని పంచుకున్నప్పుడు.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేంటి? నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్ర సీఎం పీఠంపై శివ సైనికుడిని కూర్చోబెడతాను’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment