విజయవాడ రుణం తీర్చుకుంటా.. | I Will Develope Vijayawada Constituency With Much Care Said By PVP | Sakshi
Sakshi News home page

విజయవాడ రుణం తీర్చుకుంటా..

Published Tue, Apr 9 2019 12:48 PM | Last Updated on Tue, Apr 9 2019 12:48 PM

I Will Develope Vijayawada Constituency With Much Care Said By PVP - Sakshi

సాక్షి: మీ ప్రచారం చివర అంకానికి చేరింది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? 
పీవీపీ: ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తోంది. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి సమస్యలను నా కళ్లతో ప్రత్యక్షంగా చూశాను. అనేక వేల మందిని కలిసినప్పుడు వారి బాధలను చెబుతుంటే శ్రద్ధగా విన్నాను. విజయవాడ నగరంలో మూడు వేలకు పైగా ఉన్న మెట్లను ఎక్కి కొండలపై నివసించే వారి కష్టాలను తెలుసుకున్నాను. నగరానికి నడిబొడ్డులో ఉన్న 8 మురికివాడల్లో చిన్నచిన్న గదుల్లో కనీస వసతులు లేక పడుతున్న ఇబ్బందుల్ని చూసినప్పుడు చాలా బాధనిపించింది. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు కనీస వసతులు లేక పడుతున్న కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 
సాక్షి: మీ ప్రచారం ఏ విధంగా సాగింది.?
పీవీపీ: గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు వివరించాం. వారి కష్టాలను విన్నాను. చూశాను.. ఎంపీగా నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను. 
సాక్షి: పారిశ్రామికవేత్తగా అనేక దేశాల ప్రధాన నగరాలను చూసి ఉంటారు? మన రాష్ట్ర రాజధాని చూశారు? తేడా ఎలా ఉంది?   
పీవీపీ: విజయవాడ నా స్వస్థలం. ఇక్కడే పుట్టాను. ఇక్కడే చదువుకుని.. పెరిగి పెద్దవాడిని అయ్యాను. విజయవాడలో మురికివాడల్లో పేదలు పడే కష్టాలను చూసి చలించి పోయాను. దేశ విదేశాల్లోని అనేక నగరాల్లోని అభివృద్ధిని, అక్కడ పరిపాలన చూసిన తర్వాత నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతో చేయాలనే ఆలోచనలతో వచ్చాను. ప్రచారంలో నాతో పాటు నగరంలోని కొంతమంది పారిశ్రామికవేత్తల్ని తీసుకు వెళ్లి పేద ప్రజలు కనీస సౌకర్యాలు లేకపడుతున్న ఇబ్బందుల్ని వారికి చూపిస్తున్నాను. వారి అందరి సహకారంతో వాటిని పరిష్కరిస్తాను. 
సాక్షి: ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? 
పీవీపీ: స్థానికుడిని కావడంతో నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉంది. కనీసం ఇంగ్లిష్‌లో మాట్లాడటం రాని వారు పార్లమెంట్‌కు వెళ్లితే అక్కడ ఏమి మాట్లాడతారు? ఈ ప్రాంత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనన్ని ఎక్కువ నిధుల్ని రాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. కేఎల్‌రావు వంటి వారి వాల్లనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. పారిశ్రామికవేత్తగా ఇక్కడ మాల్స్‌ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఎంపీగా సాధ్యమైనంత ఎక్కువ పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి, ప్రజలకు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది.  
సాక్షి: పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏయే సమస్యలను గుర్తించారు?
పీవీపీ: కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ ప్రజలకు కనీసం తాగునీరు అందించడం చేతకానప్పుడు వీరు ప్రజాప్రతినిధులుగా ఎలా చెప్పుకుంటారు? ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఉంది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో సుబాబుల్‌ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పథకాలు ప్రజలకు అక్కరకు రావడం లేదు. ఇక తిరువూరు మైలవరం ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ సమస్య వల్ల కిడ్నీలు చెడిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ కనీసం డయాలసిస్‌ సెంటర్‌ను కూడా ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేయించలేకపోయారు. అభివృద్ధి అంటే చెట్లు నాటించడం, డివైడర్లకు రంగులు వేయడం కాదు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా కనీస సౌకర్యాలు అందించాల్సి ఉంది. వందరోజుల్లో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయిస్తా. తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరిస్తా. 
సాక్షి: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అవకాశాలు ఎలా కల్పించనున్నారు? 
పీవీపీ: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. అవి కొంతమేరకు ఉపయోగపడతాయి. ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారికి కావాల్సిన సౌకర్యాలు అందించాలి. ఇక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేక హోదా రావడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకున్న పరిచయాలను ఉపయోగించి ఇక్కడ చిన్నచిన్న పరిశ్రమలు తీసుకువస్తాను. ఇక్కడ యువకులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు సహాయం అందజేస్తాను. 
సాక్షి: ఈ ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? 
పీవీపీ: నూటికి నూరుశాతం విజయం సాధిస్తాను. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి నుంచి చక్కటి స్పందన వస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పట్ల చాలా ఆకర్షితులవుతున్నారు. వైఎస్సార్‌ సీపీతోనే ప్రత్యేకహోదాను సాధించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. నేను ఎంపీ అయిన తర్వాత వారి సమస్యలను పరిష్కరిస్తానని నమ్ముతున్నారు.        
సాక్షి: సినీ నిర్మాతగా సినీ పరిశ్రమను ఇక్కడకు తీసుకురాగలరా? 
పీవీపీ: సినీ పరిశ్రమ ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంటుంది. అయితే ఇతర నిర్మాతలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాం. అలాగే ఇక్కడ సినీ అనుబంధ పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement