ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ (ఫైల్ ఫొటో)
ఇస్లామాబాద్ : రాజకీయాల్లోకి అడుగుపెట్టినా క్రికెట్ అనే పదాన్ని ఇమ్రాన్ ఖాన్ నుంచి వేరు చేయలేం అనిపిస్తోంది. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్ అందించి దేశ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తి ఇమ్రాన్. పాకిస్తాన్ నూతన ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఆహ్వానించిన విషయం విదితమే. ఆ వేడుకలో ఆహ్వానితుల జాబితాలో భారత క్రికెటర్లకు ఇమ్రాన్ స్థానం కల్పించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు.
తాను క్రికెట్ ఆడే సమయంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఆగస్టు 11న ప్రధానిగా తన ప్రమాణ స్వీకార వేడుకకు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. వీరితో పాటు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్, ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్‌కు ఆహ్వానం అందించారు. పాక్ విదేశాంగశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వీరికి ఇన్విటేషన్ పంపినట్లు పీటీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2014 మేలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఏ తరహాలో ప్రమాణ స్వీకారం చేశారో.. నేడు అదే తీరును ఇమ్రాన్ ఖాన్ ఫాలో అవుతున్నారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను సైతం మోదీ ఆహ్వానించి ద్వైపాక్షిక సంబంధాలకు శ్రీకారం చుట్టారు. కాగా, నేడు ఇమ్రాన్ సైతం సార్క్ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదీని, భారత దిగ్గజ క్రికెటర్లకు ఆహ్వానితుల జాబితాలో చోటు కల్పించారు.
1983లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను హర్యానా ‘హరికేన్’ కపిల్ దేవ్ సారథ్యంలోనే భారత్ తొలిసారి నెగ్గగా, 1992లో అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించి పాక్ ప్రజలకు చిరకాల కానుక అందించారు. తాజాగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment