ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు మందీ మార్బలంతో వెళుతుంటారు. కొందరు డజన్ల సంఖ్యలో కార్లతో వెళ్లి నామినేషన్లు వేస్తే మరి కొందరు గుర్రాల మీద, ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్లు వేస్తారు. అయితే, బిహార్‌కు చెందిన మణి భూషణ శర్మ అందరికంటే విలక్షణంగా ఉండాలని, అందరినీ ఆకర్షించాలని ఏకంగా గాడిదపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు.అయితే,ఆయన గాడిద సవారీ ఎంత మందిని ఆకట్టుకుందో తెలియదు కాని అధికారులకు మాత్రమే నచ్చలేదు.
దాంతో జంతువుని హింసించాడంటూ శర్మపై కేసు పెట్టారు. బిహార్‌లోని హలస్‌నగర్ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మణిభూషణ్ జెహనాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. ఏడో దశలో అంటే మే 19న పోలింగు జరిగే ఈ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు. ఆ రోజున గాడిదపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయనాయకులు ప్రజల్ని గాడిదల్లా చూస్తున్నారన్న సంగతి తెలియజేయడానికే తాను గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్టు శర్మ చెప్పారు. అయితే, ఎన్నికల అధికారులకు ఈ గాడిద సవారీ నచ్చలేదు.
శర్మపై సర్కిల్ అధికారి సునీల్ కుమార్ జంతు హింస నివారణ చట్టం కింద కేసు పెట్టారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయింది. పోనీ విధం చెడ్డా ఫలమైనా దక్కిందా అంటే అదీ లేదు. సాంకేతిక కారణాల వల్ల శర్మ నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.పేరు కోసం చేసిన పని ప్రయోజనాన్నే నాశనం చేసిందంటూ శర్మ వాపోతున్నారు. స్థానికులు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా పోటీ చేసి ఓడిపోతుంటారని,ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే ఓడిపోయారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment