లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చి బీజేపీని గద్దెదింపుతాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. జీ మీడియా ‘ఇండియా కా డీఎన్‌ఏ కాన్‌క్లేవ్ 2019’ కార్యక్రమంలో తన మదిలోని మాటలను పంచుకున్నారు. తాను చేసే పనుల ద్వారానే ప్రజల ఆదరణను పొందుతానని చెప్పారు. ఇక కుల, మత రాజకీయాలకు కాలం చెల్లదని జోస్యం చెప్పారు.
యువత ఆశలను బీజేపీ అడియాసలు చేసిందని.. ఆ పార్టీ పట్ల యువత మొగ్గుచూపరని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త ప్రధాని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా.. తనకు అంత పెద్ద ఆశలు లేవని చెప్పారు. తన సేవలు యూపీకే పరిమితమని పేర్కొన్నారు.
ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కేవలం రిబ్బన్ కటింగ్‌లు మాత్రమే చేస్తున్నారు కానీ.. ప్రాజెక్టులను ప్రారంభించడానికి మాత్రం ముందుకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై కూడా అఖిలేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ మంచి రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చారని, మంచి ఫలితాలు సాధించాలంటే ఇంకా కష్టపడాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం కశ్మీరు సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. తాము మాత్రం సామాజిక న్యాయం అంశంతో రాబోయే ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొందుతామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు ఉపయెగించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో మహాకూటమి ఎక్కువ సీట్లు జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికలే ఇందుకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అత్యుత్తమ ఎజెండాతో, మంచి సందేశంతో మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజల అభిమానాన్ని పొందుతామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment