సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు క్లియరెన్స్‌కు తొలిరోజు అవాంతరం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీల గందరగోళంతో అధికార పక్షం బిల్లును ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభను స్పీకర్ వాయిదా వేశారు. బిల్లుపై గురువారం తిరిగి చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఇది వరకే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు ఇప్పుడు రాజ్యసభలోకి చర్చకు వచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సభలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకొంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సభలో మాట్లాడనివ్వాలని కోరారు. తన మాట వినకుంటే సభను వాయిదా వేస్తానని కూడా హెచ్చరించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ రాజ్యసభలో మోషన్ ఇచ్చారు. అయితే, ఈ బిల్లును ఎందుకు సెలక్ట్ కమిటీకి ఇవ్వకూడదనే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లు ఇవ్వడంతో సమయం వృధా అవుతుందని, కనీసం ఆరు నెలలు గడిపోతాయని అన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అత్యవసరంగా ఆమోదించాల్సిన బిల్లు అని, సుప్రీంకోర్టు ఆందోళన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఎవరూ ఇవ్వడం లేదో మొత్తం భారతదేశం చూస్తోందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి సభలో న్యాయశాఖ మంత్రి చెప్పిందంతా కూడా సరికాదన్నారు. ఈ బిల్లు కచ్చితంగా సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి (గురువారానికి) వాయిదా వేశారు.
'ట్రిపుల్' బిల్లుపై ప్రతిపక్షాల ఉడుంపట్టు
Published Wed, Jan 3 2018 4:37 PM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment