ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- పాల్‌గర్ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు
ముంబాయి: అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్ ఈ విధంగా అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలు ఈ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్‌గర్ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందని అన్నారు. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందని అన్నారు.
ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు. దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఈవిధమైన కుల హింసకు, కుల ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment