గుట్టు తేలితే బాబుపైనే నజర్‌! | Intensely IT inquiry on Crores to Vote Case | Sakshi
Sakshi News home page

గుట్టు తేలితే బాబుపైనే నజర్‌!

Published Wed, Oct 3 2018 4:02 AM | Last Updated on Wed, Oct 3 2018 4:02 AM

Intensely IT inquiry on Crores to Vote Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ ఎదుర్కోబోతున్నారా? వారం రోజులుగా ఆదాయపుపన్ను శాఖ నిర్వహిస్తున్న సోదాలు, సేకరిస్తున్న ఆధారాలనుబట్టి చూస్తే అందరిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 5 కోట్లు ఇవ్వజూపి రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వడం, స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ ఇచ్చిన హామీల ఫోన్‌ సంభాషణ చంద్రబాబుదే అని తేలడంతో ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణను వేగవంతం చేశాయి. స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడివనే దానిపై ఐటీశాఖ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది. బుధవారం జరగనున్న విచారణ లో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్ట వచ్చ నే ఆలోచనతో ఐటీశాఖ ఉంది. ఆ డబ్బు సంగతి తెలియదని నిందితులు చెబితే  ఈడీ కేసు నమోదు చేసే అవకాశముంది. అదే జరిగితే కేసులోని ప్రతి ఒక్కరికీ ఈడీ సమన్లు జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. 

మేమే లేఖ రాశాం... 
ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ రూ. 50 లక్షల సంగతి తేల్చాలని తామే లేఖ రాసినట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ప్రతినిధితో చెప్పారు. 2015 లో ఒకసారి, మూడు నెలల క్రితం మరోసారి ఐటీ శాఖకు లేఖ రాసినట్లు సంబంధిత అధికారి ధ్రువీకరించారు. అయితే ఆ సొమ్ము గుట్టు వీడితే కుట్రకు బీజం వేసిన వారిని విచారించడం మరింత సులభమవుతుందని, ఆ పాత్రధారి ఎవరో తేలితే కేసులో బలమైన ఆధారం లభించినట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురి నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసిన తాము ఐటీశాఖ ఇచ్చే నివేది క ఆధారంగా అసలు నిందితులను చేర్చి తుది చార్జి షీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

ఒక్కొక్కటిగా లింకులు ఛేదిస్తూ..
స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తెచ్చిన రూ. 50 లక్షల లింకును ఒక్కొక్కటిగా తేలుస్తూ ఐటీశాఖ కీలక అడుగులు వేస్తోంది. ఉదయసింహ, కొండల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పద్మనాభరెడ్డి ఇళ్లలో ఏకధాటిగా చేసిన సోదాల్లో ఈ సొమ్ముకు సంబంధించిన ఆధారాలను పట్టుకునే పనిలో పడింది. అయితే వారి ఖాతాల నుంచి లేదా వారి సంబంధీకుల నుంచి రూ. 50 లక్షలు వెళ్లి ఉంటాయా అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఫోన్లు, హార్డ్‌డిస్క్‌ల నుంచి సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్‌ నిపుణులను రంగంలోకి దించగా వారు డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. ఎవరు ఇమ్మంటే నిందితులు డబ్బిచ్చారు.. ఆ డబ్బు ఏ నేతకు సంబంధించినది అనే ప్రశ్నలకు డేటా రికవరీ ద్వారా సమాధానం లభించవచ్చని భావిస్తున్నారు. 

రణధీర్‌ను విచారించిన టాస్క్‌ఫోర్స్‌ 
ఓటుకు కోట్లు కేసులో ప్రశ్నించేందుకు రేవంత్‌రెడ్డి అనుచరుడైన ఉదయసింహ స్నేహితుడు రణధీర్‌రెడ్డిని ఆదివారంరాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నాగోల్‌ సమీపంలోని ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. గతంలో ఉదయసింహ ఇల్లు ఖాళీ చేసిన సమయంలో తనకు ఒక కవర్‌ ఇచ్చాడని, అందులో హార్డ్‌డిస్క్, ఉదయసింహ తల్లికి చెందిన బ్యాంక్‌ ఖాతాల వివరాలు ఉన్నాయని రణధీర్‌ చెప్పారు.  

నేడు విచారణకు రేవంత్‌రెడ్డి.. 
తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నివాసంలో నాలుగు రోజుల కిందట సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఆయన్ను బుధవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేశారు. దీంతో రేవంత్‌ బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌ భవన్‌కు వెళ్లనున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్‌లను కూడా విచారించనున్నారు. రేవంత్‌ మామ ఎస్‌. పద్మనాభరెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డిని కూడా మళ్లీ విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.  

వణికిపోతున్న ఏపీ పెద్దలు..
ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఎప్పుడు ఐటీ అధికారులు తమ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తారో నని ముందుగానే అన్నీ సెట్‌ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వ్యాపారాలున్న ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కార్యాలయాలు, ఇళ్లలో కీలక పత్రాలను ఏపీకి తరలించి ఉంటారని తెలుస్తోంది. ఏపీలో అయితే స్థానిక అధికారులు సోదాలకు రాకపోవచ్చని, అక్కడి ఇంటెలిజెన్స్‌ అధికారులు సైతం టీడీపీ పెద్దలకు సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నేతలు ఐటీ రిటర్నుల దాఖలుపై చార్టెడ్‌ అకౌంట్లతో జరిమానాలతో సహా చెల్లిస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. మరికొందరు తాము దాఖలు చేసిన ఐటీకి... వ్యాపారాలకు లెక్కల్లో తేడా ఉందా అనే అంశాలనూ సరిచూసుకుంటున్నట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement