సాక్షి, అమరావతి : ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా విద్యార్థుల్లో అభద్రతా భావం పోతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియం విద్యతో రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల తలరాత మారుతుందని చెప్పారు. విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని చంద్రబాబు భయపడిపోతున్నారని తెలిపారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే.. గుంటనక్కలాగా శాసనమండలి గ్యాలరీలోకి వెళ్లి టీడీపీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్‌ను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు.
ఏపీ దేశానికే ఆదర్శం కాబోతుంది : హఫీజ్ ఖాన్
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంగ్లిష్ రాకపోతే విదేశాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్ అర్థంకాక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు ఆ సమస్య ఉండదన్నారు. ఇంగ్లిష్ మీడియంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని తెలిపారు. చంద్రబాబు వైఖరి ఎంటో ఎవరికి అర్థం కావడం లేదని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చదువుల బడిలాగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment