
జానా రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఇది ప్రజల విజయమని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగిద్దామనుకున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు అని ఆయన అన్నారు. న్యాయాన్ని, వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ విజయం సాధించారని అభినందించారు. సభ్యత్వ రద్ధు చెల్లదంటూ వెలువరించిన 175 పేజీల హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందని కొనియాడారు.
కుటిల రాజకీయాలు చేసే నేతలకు ఈ తీర్పు కనువిప్పు అని పేర్కొన్నారు. ప్రశ్నించే వారే ఉండొద్దన్న ధోరణిలో టీఆర్‌ఎస్ ఉందని జానా మండిపడ్డారు. అందుకనే కోదండరాం పార్టీ సభకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై నిరసన గళమెత్తకుండా చేసేందుకు ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని విమర్శించారు. తీర్పు అనంతరం ఎమ్మెల్యే సంపత్ విలేకర్లతో మాట్లాడారు. గత నెలలో జరిగిన పరిణామాలు కుటిల రాజకీయాలకు తార్కాణమని అన్నారు. అయినా ‘మేం ధైర్యం కోల్పోలేదు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకముంది. ప్రజాస్వామ్యాన్ని దొరల గడీలో బంధించాలన్న కుట్రలకు మా విజయం తగిన గుణపాఠం’ అని సంపత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment