కె.జానారెడ్డి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. గిరిజన, ఉద్యానవన విశ్వ విద్యాలయం, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అంశాల సాధన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ముస్లిం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీర్మానం చేసినా ఇంతవరకూ అతీగతీ లేదన్న జానారెడ్డి, ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీతో భేటీలో సీఎం కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అంశాన్నీ సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. ఆదివారం జరిగే నీతిఆయోగ్ భేటీలో అయినా ఈ అంశాల్ని ప్రస్తావించాలని సూచించారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ప్రధానిని ఒప్పించాలని జానా కోరారు. విభజన అంశాల సాధనలో అధికార పార్టీ చేసే పోరాటానికి కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
బయ్యారంపై నోరు విప్పడం లేదెందుకు?: పొంగులేటి
‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని నినదించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఈ అంశంపై నోరెందుకు విప్పడం లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఏపీలోని కడప స్టీలు ప్లాంటుపై అధికార పక్షం, ప్రతిపక్షనేత, ఇతర పార్టీలు పోరాడుతుంటే ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ గొంతెందుకు మూగబోయిందన్నారు. మూడు రోజులుగా బయ్యారం ఉక్కుపై ఆందోళన నెలకొన్నా ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదని, రాజకీయ, వ్యక్తిగత ఎజెండానే కీలకంగా మారిందని విమర్శించారు. బయ్యారంపై సోమవారం ఖమ్మంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం సంతకాల సేకరణ చేపడతామని ఆయన తెలిపారు. బలరాం నాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ మాటలకూ, చేతలకూ పొంతన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, వారి సమస్యలపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment