కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే.. | Janga Krishna Murthy Comments on TDP | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే..

Published Wed, Nov 13 2019 5:10 AM | Last Updated on Wed, Nov 13 2019 5:10 AM

Janga Krishna Murthy Comments on TDP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దని కొందరు రాజకీయ నేతలు చెబుతున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాలు సాధించాలన్నా, విదేశాల్లో చదవాలన్నా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో పోటీ పడాలన్నా ఇంగ్లిష్‌ భాష తప్పనిసరి అన్నారు.

వారి పిల్లల భవిష్యత్‌ బావుండాలి, బడుగు బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో ఉండాలా? అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం కొనసాగితే తమ కార్పొరేట్‌ స్కూళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందనే కొందరు విపక్ష నేతలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. తెలుగుకు అన్యాయం చేయాలనో.. పరభాషని తెలుగు భాషపై రుద్దాలనో తమ నేత ఆలోచన కాదన్నారు. పేదలంతా బాగా చదువుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనేదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన అని చెప్పారు.   

బీసీలను టీడీపీ ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది 
రాష్ట్రంలో బీసీలందరినీ టీడీపీ కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది తప్ప వారి అభివృద్ధికి ఏనాడు ఆలోచన చేయలేదని కృష్ణమూర్తి విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కేవలం ఐదు నెలల్లోనే అమలు చేసిన ఏకైక సీఎం జగన్‌ అని కొనియాడారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి... బీసీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కేటాయించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్‌ స్కూళ్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement