న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీచేస్తామనీ, ఎన్డీయే కూటమిలో కొనసాగుతామని జేడీయూ స్పష్టం చేసింది. ఆదివారం ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకం విషయంలో బీజేపీతో జేడీయూకు విభేదాలున్నాయన్న వాదనను ఆ పార్టీ నేతలు కొట్టిపారేశారు. సీట్ల సంఖ్య తర్వాత చూసుకుంటామనీ, వచ్చే ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసే పోటీ చేసి బిహార్‌లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.
సీట్ల పంపకం విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ తమ పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్‌కు ఉంటుందన్నారు. కాగా, కార్యవర్గ సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ అవినీతి, నేరాలు, మతవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు. బిహార్‌లో తమ పార్టీని ఓడించాలనుకునే వాళ్లే అపజయం పాలవుతారని ఆయన హెచ్చరించారు. మతవాద పార్టీగా ముద్ర ఉన్న బీజేపీతో జేడీయూ సంబంధాలు బలహీనపడ్డాయనీ, బీజేపీలోనూ నితీశ్‌కు శత్రువులున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో నితీశ్ చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యతేర్పడింది.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం
కేంద్రం ఇప్పటికే పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వం (సవరణ) బిల్లు–2016ను వ్యతిరేకిస్తూ జేడీయూ ఓ తీర్మానం చేసింది. అస్సాంలోని స్థానిక భాషలు, సంస్కృతికి ఈ బిల్లు ప్రమాదకరమని జేడీయూ పేర్కొంది. ఈ బిల్లుపై అస్సాం ప్రజల ఆందోళనలను తగ్గించేందుకు కృషి చేయాలని జేడీయూ కేంద్రాన్ని కోరింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి భారత్‌కు వలస వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత్‌లో ఆరేళ్లు నివాసం ఉన్న తర్వాత వారికి పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. దీనివల్ల అస్సాం భాషలు, సంస్కృతికి ప్రమాదం ఏర్పడటంతోపాటు ఈశాన్య భారతంలో శాంతి, మత సామరస్యం దెబ్బతింటుందని జేడీయూ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బిహార్‌లో అల్లర్లకు పాల్పడిన వారిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కలవడం, హత్య కేసు దోషులను మరో కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పూలమాలలతో సత్కరించడాన్ని కూడా జేడీయూ తప్పుబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment