
సారంగాపూర్(జగిత్యాల): తెలంగాణ, ఏపీలో తిరిగి అధికారంలోకి రావడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లోని అర్పపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాకుండా ఉండేందుకు ఏపీలో ఎన్నడూ ఒకటి కాకుండా ఉన్న కమ్మ, కాపు వర్గం కలసి పనిచేయడానికి బాబు ఎత్తులు వేశారన్నారు.
దీనిలో భాగంగానే జనసేన పేరుతో సినీనటుడు పవన్‌కల్యాణ్ ప్రజల మధ్య చేస్తున్న ప్రసంగాల్లో ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శించారన్నారు. బాబు, పవన్ కలిసే ముం దుకు సాగుతున్నారన్న అనుమానం వ్యక్తం చేశా రు. అధికార పార్టీ లోపాలను ఎత్తిచూపకుండా పవన్‌కల్యాణ్ జగన్‌ను విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలకు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం, మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణమని కితాబివ్వడం దీనిలో భాగమేనని స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.