దూసుకొస్తున్న జిగ్నేష్‌.. టెన్షన్‌.. టెన్షన్‌ | Jignesh Mevani reaches Parliament Street | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్న జిగ్నేష్‌.. టెన్షన్‌.. టెన్షన్‌

Published Tue, Jan 9 2018 2:29 PM | Last Updated on Tue, Jan 9 2018 2:48 PM

Jignesh Mevani reaches Parliament Street - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క వాటర్‌ కెనాన్లు, భారీ కేడ్లు, బాష్ప వాయుగోళాలు, లాఠీలు పుచ్చుకొని నిల్చున్న పోలీసులు.. మరోవైపు పెద్ద పెట్టున నినాదాలతో, మద్దతుదారులతో దూసుకొస్తున్న దళిత నేత జిగ్నేష్‌ మేవానీ. మొత్తానికి పార్లమెంటు వీధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీకోసం పార్లమెంటు వీధిలో జిఘ్నేష్‌ మేవాని బయలుదేరారు. పలు నిర్బంధాలను చేధించుకొని ఆయన పార్లమెంటు వీధికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ర్యాలీ కోసం దాదాపు 600మంది మద్దతు దారులు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు వీధి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు రాజ్యాంగం కాపీలతో, మనస్మృతి కాపీలతో 'యువ హంకార్‌ ర్యాలీ' నిర్వహించి తీరుతామని మేవానీ ప్రకటించారు.

అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్లమెంటు వీధిలో ఆంక్షలు ఉన్నాయని, అక్కడ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ, మేవానీ, ఆయనకు మద్దతుగా అస్సాం రైతుల హక్కుల పోరాట ఉద్యమ నేత అఖిల్‌ గొగోయ్‌ మరికొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ర్యాలీ కోసం కార్యకర్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా.. ఈ ర్యాలీ కోసం దాదాపు 10 వేలమంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు వారిని నిలువరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్‌ మొత్తం హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కొన్ని మెట్రో సర్వీసులు రద్దు చేశారు. విద్య, ఉద్యోగాలు, లింగ సమానత్వంవంటి అంశాలపై పోరాటం చేస్తున్న దళిత సంస్థ బీమ్‌ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement