![Gujarat MLA Jignesh Mevani Re Arrested by Assam Police After Getting Bail - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/jignesh-mevani.jpg.webp?itok=dm3N6kJk)
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ల కేసులో జిగ్నేష్ మేవానీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనపై కొత్త కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసులు జిగ్నేష్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. అయితే ఈసారి అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అస్సాంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో(బార్పేట, గోల్‌పరా) మేవానిపై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య కోక్రాఝర్ జైలు నుంచి బార్‌పేట పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.
దీనిపై జిగ్నేష్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై తాజాగా రెండు జిల్లాల్లో నమోదైన కేసుకు సంబంధించి మళ్లీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది జరుగుతుందని తమకు ముందే తెలుసని, దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో తొలిసారి మేవానిని గత బుధవారం అస్సాం పోలీసులు పాలన్‌పూర్ పట్టణంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అస్సాం బీజేపీ నేత అరూప్ కుమార్ దే ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడం వంటి కేసుల్లో అరెస్టు అయిన మేవానీని అస్సాంలోని కోక్రాఝర్‌లోని స్థానిక కోర్టు ఆదివారం ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం సోమవారం ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి విడుదల కాకముందే మరో కేసులో బార్పేట పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment