సాక్షి, తాడేపల్లి : జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స‍్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం గాడ్సే వారసుడిగా అక్రమ నివాసంలో ఉంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం లక్షా 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిందన్నారు. సీఎం జగన్ ప్రజారంజక పాలనను ఓర్వలేక.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు నోరు విప్పాలి. గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదో కాదో చెప్పాలి. ప్రజా సమస్యలు 72 గంటల్లో పరిష్కారం కావడం మంచిదో కాదో చెప్పాలి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అసలు నీ హయాంలో ఎప్పుడైనా లక్ష 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశావా’ అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
పిల్లలను అవమానిస్తావా
సచివాలయ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించిన చంద్రబాబు ఒక్క ఆధారమైన చూపించగలవా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వాళ్ళు లక్షలకు ఉద్యోగాలు కొనుకున్నారని అవమనిస్తావా అని మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలను చంద్రబాబు అభినదించాలే తప్ప కించపరచకూడదని హితవు పలికారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సంబంధించిన బిల్లులు పెడితే చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయాడు. సీఎం జగన్ చంద్రబాబుకు ఎన్నటికీ అర్థంకారు. పేద ప్రజలకు మాత్రమే ఆయన అర్థమవుతారు. చంద్రబాబు మాటలన్నీ దివాలకోరు రాజకీయ నేత మాటల్లాగే ఉంటాయి. చంద్రబాబు పాలనలో గాంధీ జయంతి రోజున కూడా విచ్చల విడిగా మద్యం అమ్మేవారు. వైఎస్ జగన్ గాంధీ వారసుడు అయితే.. చంద్రబాబు నాయుడు గాడ్సే వారసుడు. చంద్రబాబుకు.. ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప మరేపని లేదు. గాంధీ జయంతి రోజున ఎక్కడ మందు అమ్మారో చంద్రబాబు నిరూపించాలి’ అని సవాల్ విసిరారు. తన తోక పత్రిక, బూతు పత్రికను పట్టుకొని సీఎం జగన్‌పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బూతు పత్రిక యజమానికి పేపర్ లీకేజీపై సవాల్ విసిరాము. మా సవాలుకు బూతు పత్రిక యజమాని పారిపోయాడు’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment