
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తే.. నేడు ఆ పార్టీలో చేరాడని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అధికారం, పదవులు అన్న కోణంలోనే రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం అన్న కోణంలో చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉప ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగయ్యిందని, కాంగ్రెస్‌కూ అదే గతి పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అసలు రంగు ఏంటో తెలియాల్సి ఉందని, కొడంగల్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చిందో అదే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలసి మంగళవారం జూపల్లి విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ ఉందని, అన్ని పార్టీలు ఏకం కావాలని రేవంత్ అనడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నది వాస్తవమే అయినా, ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్న వాస్తవాన్ని మరిచిపోవద్దని అన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి చేరాడని జూపల్లి ఆరోపించారు. చంద్రబాబు శిక్షణలో పెరిగానని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో సీఎం కేసీఆర్ ఏమీ చేయకపోతే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎలా గెలిచారని నిలదీశారు. కాంగ్రెస్‌ను బురిడీ కొట్టించి రేవంత్ ఆ పార్టీలో చేరాడని, అనేక కుంపట్లు ఉన్న కాంగ్రెస్‌లో రేవంత్ పరిస్థితి ఏమిటో త్వరలో తేలిపోతుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment