సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయం మంగళవారం కొత్తమలుపు తిరిగింది. 17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధానిని కలిశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయం అత్యంత ఆసక్తిగా మారింది. సింధియా బీజేపీలో చేరుతారని..రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించనున్నారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
(చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’)
కాగా, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. వీరంతా సింధియాకు మద్దతుగా ఇప్పటికే బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్నారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు.
(చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు)
దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment