భోపాల్: ‘‘దాదాపు 20 ఏళ్ల పాటు కలిసి ఉన్న నా కుటుంబం, సంస్థను వీడాను. ఎక్కడైతే నిబద్ధతతో పనిచేశానో ఆ సంస్థ నుంచి నన్ను నేను మీకు అప్పగిస్తున్నాను. అయితే ఈ కుటుంబం(బీజేపీ)లోకి రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా కోసం మీరు తలుపులు తెరిచారు. ప్రధాని మోదీజీ, నడ్డా సాబ్, అమిత్ భాయ్ ఆశీర్వాదాలు నాకు లభించాయి. ఇది నాకు ఎమోషనల్ డే’’ అంటూ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సింధియా.. ఆ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.(రసకందాయంలో మధ్యప్రదేశ్ రాజకీయం.. 22 మందికి నోటీసులు)
ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో భోపాల్‌కు చేరుకున్న సింధియాకు బీజేపీ శ్రేణులు, అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి సింధియాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడారు. ‘‘కారులో ఏసీ ఉపయోగించని నాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు శివరాజ్ సింగ్ చౌహాన్. మరొకరు జ్యోతిరాదిత్య సింధియా. మేము ఒకటిగా ఉన్నాం కాబట్టి కార్యకర్తలు కూడా ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒకటి.. ఒకటి కలిస్తే.. అది 2 కాకుండా 11 కావాలి’’ అని సింధియా తన అనుచరులను ఉద్దేశించి పేర్కొన్నారు. కలిసికట్టుగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శివరాజ్ సింగ్‌తో కలిసి భోజనం చేశారు. (సింధియా నిష్క్రమణపై సచిన్ పైలట్ ట్వీట్)
ఇక ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సింధియా, శివరాజ్ ఇలా కలిసి భోజనం చేస్తున్న ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జ్యోతిరాదిత్యను ముఖ్యమంత్రిని చేస్తారని అంతా భావించారు. అయితే సీనియర్ నేత అయిన కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన అధిష్టానం ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుణ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి సింధియా ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు.(‘మహరాజ్’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..!)
Comments
Please login to add a commentAdd a comment