
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీని పరుష పదజాలంతో సీఎం కేసీఆర్ విమర్శించడం, కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేయడాన్ని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు అవమానకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కనీస గౌరవం లేకుండా ప్రధాని గురించి వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని, వారి మాటలు అహంకారానికి, అధికారదర్పానికి నిదర్శనమని విమర్శించారు.
కుటుంబ పెత్తనం ఎందుకో చెప్పాలి..
రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందని.. ఇది సిగ్గుచేటని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తమ కుటుంబ పెత్తనం ఎందుకో చెప్పాలన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటూ, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదని అనుకోవడం కేసీఆర్ తెలివితక్కువతనమే అవుతుందన్నారు. కశ్మీర్ సమస్యపై ఇప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్.. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఎన్ని రోజులు పార్లమెంట్‌కు హాజరయ్యారో ప్రజలకు బహిరంగ సభలో చెప్పి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అతి తక్కువ హాజరు శాతం కేసీఆర్‌దేనన్న నిజం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదన్న ఎంపీ కవిత మాటలను ఆయన ఖండించారు.
మీరు హిందుత్వానికి ప్రతీకా..?
హిందుత్వానికి తాను ప్రతీక అంటూ ఎంఐఎం కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో కేసీఆర్ తెలపాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయన తన పాపప్రక్షాళన కోసం, తన కుటుంబం కోసం యాగాలు చేస్తున్నారే తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదని ఆరోపించారు. హిందువుగా చెప్పుకుంటున్న కేసీఆర్ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ వైఖరి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డుపడిన ఎంఐఎం పార్టీ ఏ విధంగా తమకు సహజ మిత్రుడో చెప్పాలన్నారు. బీజేపీ మద్దతు, చొరవతోనే తెలంగాణ వచ్చిందని, టీఆర్‌ఎస్ ఇద్దరు ఎంపీలతో రాలేదని చెప్పారు. జాతీయ పార్టీ పెడతానంటున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో చెప్పాలని, అందులో ఒక్క పార్టీ అయినా ఉందా.. అని ప్రశ్నించారు.
మేమూ చౌకీదార్లమే..
దేశం మొత్తం మోదీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అయినందునా మోదీని గెలిపించుకోవాలన్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా తెలంగాణలో పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. తాను ‘చౌకీదార్’(కాపాలాదారు) అని ప్రధాని ప్రకటించడాన్ని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేస్తున్నారని.. ప్రధాని మాదిరిగా తామూ చౌకీదార్‌లుగా కొనసాగుతామని చెప్పారు. తమ ట్విట్టర్ ఖాతాల్లో చౌకీదార్‌గా పేర్లు మార్చుకున్నామన్నారు. అనంతరం దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్‌కు నివాళులు అర్పించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment