‘బారు, బీరు సర్కారు కావాలా?’ | Muralidhar Rao And K Laxman In Karimnagar Public Meeting | Sakshi
Sakshi News home page

‘దేశంలో 50 మంది దాకా ప్రధానిని కావాలని కలలు’

Published Thu, Apr 4 2019 3:18 PM | Last Updated on Thu, Apr 4 2019 3:30 PM

Muralidhar Rao And K Laxman In Karimnagar Public Meeting - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : దేశంలో 50 మంది దాకా ప్రధానమంత్రులు కావాలని కలలు కంటున్నారని, వారంతా వారానికొకరు ప్రధానిగా ఉండాలనుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. విజయ సంకల్ప సభలో మురళీధర్‌ రావు మాట్లాడుతూ.. ప్రధానితో అత్యవసర సమావేశం ఉన్నందున కరీంనగర్‌ సభకు రాలేకపోతున్నానని అమిత్‌షా ఫోన్‌ చేశారని అన్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో మిగిలిన ఏకైక జాతీయ పార్టీ అని అన్నారు. నరేంద్రమోదీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించగలరని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ నుంచి సంజయ్‌, పెద్దపల్లి నుంచి కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ చరిష్మా తట్టుకోలేక కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లారని అన్నారు. యువరాజు పట్టాభిషేకానికి కేసీఆర్‌ గిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిజీవులు కర్రుకాల్చి కేసీఆర్‌కు వాత పెట్టారని అన్నారు. కేసీఆర్‌ నిజమైన హిందూ కాదనీ, షేర్వాణి వేసుకున్న మరో ఓవైసీవని అన్నారు. కేసీఆర్‌ చేసిన యాగాలన్నీ తన స్వార్థం కోసమే చేశారన్నారు. కొండగట్టులో 60మంది బస్సు ప్రమాదంలో చనిపోతే.. పరామర్శించేందుకు రాని కేసీఆర్‌ హిందువెట్లా అవుతువాని ప్రశ్నించారు. శ్రీరామ కళ్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు మనవడితో పంపిస్తావా అని నిలదీశారు. అసదుద్దిన్‌ చంకలో దూరి మోదీని తిట్టడం మైనార్టీ ఓట్ల కోసం కాదా అంటూ దుయ్యబట్టారు.

పుల్వామాలో జవాన్లు చనిపోయినప్పుడు ఉగ్రవాద స్థావరాలపై మన సైనికులు దాడిచేస్తే కేసీఆర్‌ అవమానించేవిధంగా మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు జరిగినవి సర్జికల్‌ స్ట్రైక్‌లు కాదని.. ప్రజలు స్ట్రైక్‌ చేశారని ఎద్దేవాచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఫ్యామిలీ ఫ్రంట్‌.. దాని టెంట్‌ కూలిపోయిందన్నారు. తెలంగాణ దాటితే.. కేసీఆర్‌ చెల్లని రూపాయి వంటివాడని విమర్శించారు. తెలంగాణను బారు, బీరుగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బారు, బీరు సర్కారు కావాలా? అంటూ ప్రశ్నిస్తూ.. ఫామ్‌హౌస్‌ పాలన కావాలనుకునే వాళ్లు టీఆర్‌ఎస్‌కు ఓటేయండని అన్నారు. కేటీఆర్‌.. ఢిల్లీ మెడలు వంచడం అంటే.. మీ బావ హరీష్‌ మెడలు వంచినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌ అవినీతి, కుటుంబపాలనపై భరతం పడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement