సాక్షి, హైదరాబాద్: శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వ కుంట్ల కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా, బుధవారం ఉదయం కవిత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశించినా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. కవిత నామినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ శాసనసభ్యులు, పలువురు పార్టీ నేతలు హాజరుకానున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించని కవిత ఈ నెల 13న జరిగిన పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదే రోజు కవిత జన్మదినం కూడా కావడంతో అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న లోయపల్లి నర్సింగారావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు రెండు రోజుల క్రితం ముగిసిన శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అయితే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే లోయపల్లి నర్సింగారావు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. కాగా, గవర్నర్ కోటా స్థానానికి సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గవర్నర్ కోటా అభ్యర్థిని కూడా బుధవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment