క్రియాశీల రాజకీయాల్లోకి కవిత రీ ఎంట్రీ | Kalvakuntla kavitha File Nomination To MLC From Nizamabad | Sakshi
Sakshi News home page

క్రియాశీల రాజకీయాల్లోకి కవిత రీ ఎంట్రీ

Published Thu, Mar 19 2020 8:40 AM | Last Updated on Thu, Mar 19 2020 3:49 PM

Kalvakuntla kavitha File Nomination To MLC From Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : క్రియాశీలక రాజకీయాల్లోకి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పునరాగమనంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. నిజామాబాద్‌ జిల్లా రాజకీయం మరోమారు వేడెక్కనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అనూ హ్యంగా కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం ఆమె మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్‌ వేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోతన్‌కర్‌ లక్ష్మీ నారాయణను బరిలోకి దింపింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మినర్సయ్య తదితరులతో కలిసి ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, మరో నాయకుడు సుభాష్‌రెడ్డిలు నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు. వీరిద్దరు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. (నిజామాబాద్‌పై పట్టు కోసమే)

కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ వేసిన లోయపల్లి నర్సింగ్‌రావు బుధవారం మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడం గమనార్హం. ఆయన తన నామినేషన్లను ఉపసంహరించుకుంటారని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. నామినేషన్ల పర్వం నేటి మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా, చివరి రోజు గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈనెల 23 వరకు గడువుంది.

ఘన స్వాగతం.. 
పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కవిత జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె అనుచరులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కవితను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అభిలాషించారు. కవిత రావాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు సర్క్యూలేట్‌ అయ్యాయి. అయితే శ్రేణులు కోరుకున్నట్లుగానే కవిత జిల్లా క్రియాశీలక రాజకీయాల్లోకి మరోమారు అడుగుపెట్టడంతో ఆమె అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నామినేషన్‌ వేసేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా కవితకు ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నామినేషన్‌ వేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా కూడా ఆమె అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యే అవకాశాలు కనిపించాయి. అయితే ప్రతిపక్ష పారీ్టల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement