
సాక్షి, చెన్నై : విలక్షణ నటుడు కమల్ హాసన్ వచ్చే నెల 21న తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, చిహ్నంతో పాటు విధివిధానాలను ప్రకటించనున్నారు. అలాగే ‘నాలై నమదే’ అనగా.. ‘రేపు మనదే’ పేరుతో ఫిబ్రవరి 21 నుండి తన రాజకీయ పర్యటన ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ అదే రోజు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు ప్రకటిస్తానని తెలిపారు. పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అదే రోజున నమోదు చేయనున్నట్లు తెలిపారు. తన పర్యటనలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్గా నిలుస్తామని చెప్పారు.
మనిషి జీవితంలో అన్ని రంగాలు ముఖ్యమే అని, రాజకీయాలు కూడా మంచి రంగమే అని నిరూపిస్తానని కమల్ పేర్కొన్నారు. తమిళ తల్లి గీతానికి గౌరవంగా అందరూ నిలబడాలని ఆయన సూచించారు. కొన్ని సమస్యలకు పరిష్కారంతోనే సమాధానం చెప్పాలని, జాతీయ రాజకీయాల కంటే తాను ప్రాంతీయతకే ప్రాధాన్యత ఇస్తానని కమల్ వెల్లడించారు. రజనీకాంత్, తాను తమిళ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమా అనేది తనకు తెలియదని, అందరూ బాగుండాలన్నదే తనకు ముఖ్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment