
పెరంబూరు: మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 30ఏళ్లుగా తనతో ఉంటూ, తన నట జీవితానికి పక్కబలంగా ఉన్న అభిమానులకే మక్కల్ నీది మయం పార్టీ కార్య నిర్వాహక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కమల్‌హసన్ రాజకీయ రంగప్రవేశాన్ని అనూహ్యంగా ప్రకటించడంతో పాటు అంతే వేగంగా చక చకా అందుకు కార్యరూపాన్ని సిద్ధం చేసుకుని గత ఫిబ్రవరి 21న పార్టీ పేరునూ ప్రకటించేసిన విషయం తెలిసిందే. అంతే కాదు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కమల్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రధాన నగరాలు చుట్టొచ్చారు. ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తన అభిమానుల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించే బాధ్యతలను చేపడుతున్నారు.
అందుకు కమలహాసన్ నెలకొల్పిన మయం విజిల్ వెబ్ సైట్ మంచి ఫలితాలను ఇస్తోంది. రోజూ 500కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని కమల్ తన అభిమానుల ద్వారా సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. మక్కల్ నీది మయం పార్టీ ఆవిర్భవించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కమలహాసన్ సమీప కాలంలో తిరువళ్లూర్ జిల్లా అదుకత్తూర్ ప్రాంతంలో మహిళా సంఘాల మహానాడు నిర్వహించారు. అదేవిధంగా గ్రామసభలోనూ కమల్ పాల్గొన్నారు. పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయించుకున్న కమల్ గ్రామ శివారు ప్రాంతాల్లోనూ మక్కల్ నీది మయం పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా పార్టీలోని పలు శాఖలకు కార్య నిర్వాహకులను నియమించ తలపెట్టారు.
ఇందుకు గత 30 ఏళ్లుగా తనతో కలిసి నడుస్తున్న అభిమాన సంఘ సభ్యులకే ముఖ్య బాధ్యతలను అప్పగించాలని కమలహాసన్ నిర్ణయించుకున్నారట. దీంతో త్వరలో వివిధ జిల్లాలకు చెందిన అభిమానులను తన వద్దకు పిలిపించుకుని మక్కల్ నీది మయం పార్టీపై అక్కర చూపుతున్న వారిని ఎంపిక చేసి వారికి పార్టీ బాధ్యతలను అప్పచెప్పనున్నారట. ఇప్పటికే కోవై, ఈరోడ్, సేలం జిల్లాల్లో మక్కల్ నీది మయం పార్టీకి మహిళా విభాగ సంఘాలను నియమించిన కమల్ ఇతర జిల్లాల్లోనూ మహిళా విభాగ సంఘాలను నియమించి పార్టీని బలోపేతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.