సాక్షి, మధురై: తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. గత కొంతకాలం నుంచి తలెత్తిన ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన పార్టీ పేరును ప్రకటించారు. మదురైలో బుధవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ పేరును 'మక్కల్ నీతి మయ్యమ్' (పీపుల్స్ జస్టిస్ పార్టీ) అని ప్రకటించగానే సభా ప్రాంగణం మార్మోగిపోయింది. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం కమల్ పార్టీ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.
భారీ బహిరంగసభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం కమల్ తన పార్టీ పేరు ప్రకటించారు. అనంతరం కమల్ మాట్లాడుతూ.. 'నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాయకుడిగా భావించడం లేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒకడిని. ప్రజా సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటానని' అన్నారు. కొత్తగా స్థాపించిన మక్కల్ నీతి మయ్యం మీ పార్టీ. ఎప్పటినుంచో మనం కోరుకుంటున్న మార్పును తెచ్చేందుకు ఇది ఆవిర్భవించింది. మీకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు, సలహాలు ఇవ్వండంటూ పార్టీ ఏర్పాటుపై కమల్ తొలి ట్వీట్ చేశారు.
అంతకుముందు కమల్ బుధవారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలుసుకుని అక్కడి కలాం సమాధి వద్ద అంజలిఘటించారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్ కలుసుకున్న విషయం తెలిసిందే.
మక్కల్ నీతి మయ్యం పార్టీ లోగో
Comments
Please login to add a commentAdd a comment